మీ కష్టం ఎవరికీ రాకూడదు.. అన్నదాతలను ఏడిపిస్తున్న ‘అకాల వర్షాలు’

by  |
మీ కష్టం ఎవరికీ రాకూడదు.. అన్నదాతలను ఏడిపిస్తున్న ‘అకాల వర్షాలు’
X

దిశ, కామారెడ్డి రూరల్ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ‘అకాల వర్షం’ అన్నదాతను ఆగమాగం చేస్తోంది. కళ్లాల్లో కొందరు రైతులు వరి ధాన్యం ఆరబెట్టుకోగా, మరికొందరు బస్తాల్లో నింపారు. ఈ బస్తాలను రైస్ మిల్లులకు వెనువెంటనే తరలిస్తే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అధికారులు, రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల నింపిన ధాన్యం బస్తాలు కళ్లాల్లోనే ఉండటంతో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి, శాబ్దిపూర్, అడ్లూరు, గర్గుల్ తదితర గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం కుప్పలు, బస్తాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలవడంతో రైతులు ధాన్యాన్ని నీటిలో నుంచి తీస్తూ బోరున విలపిస్తున్నారు.

అధికారులే కారణం..

అకాల వర్షంతో ధాన్యపు రాశులు తడిచి పోవడానికి అధికారులే కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ఈ యేడు అతివృష్టిని సృష్టించగా అధికారులు అలసత్వం వహించడం వల్లే తాము నష్ట పోవాల్సి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. రైస్ మిల్లుల వద్ద ఉన్న లారీలను వెంటనే ఖాళీ చేయించి కొనుగోలు కేంద్రాల్లోకి లారీలను పంపించి ఉంటే తమ ధాన్యం తడిసేది కాదని పేర్కొంటున్నారు. పేపర్లలో అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు చాలా భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క అధికారి కూడా రైస్ మిల్లుల తనిఖీలకు, పరిశీలనలకు వెళ్లిన దాఖలాలు లేవని, అలా వెళ్లి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆరోపిస్తున్నారు. అధికారుల తప్పిదం వల్లనే తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తడిసిన బస్తాలను తరలించేనా..

వర్షంతో తడిసిపోయిన ధాన్యపు బస్తాలను రైస్ మిల్లులకు తరలిస్తారా? లేదా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అన్నీ బాగున్నప్పుడే అవస్థలు పెట్టే రైస్ మిల్లర్లు, తడిసిన బస్తాలను కొనుగోలు చేస్తారా? లేక మరిన్ని ఇబ్బందులు పెడతారా? అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని తరలించడంతో పాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Next Story

Most Viewed