ప్రాచీణ పంటల పరిశోధకుడు.. ఎంతో సేకరించారు!

by  |
ప్రాచీణ పంటల పరిశోధకుడు.. ఎంతో సేకరించారు!
X

దిశ, హుజురాబాద్: సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన నిత్య పరిశోధకుడిగా మారారు. ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసి అన్వేషణ ప్రారంభించారు. ఏకంగా 9 రాష్ట్రాలు తిరిగారు. పురాతన కాలంలో వేసిన వరి వంగడాలను సేకరించారు.

నీటి కొరత వల్ల..

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గారంపల్లి శ్రీకాంత్ తనకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. సాగు నీటి కొరత వల్ల దిగుబడి రాలేదు. దీంతో తాను వెరైటీ వంగడాలను సేకరించాలని భావించాడు. పూర్వకాలంలో ఏఏ వంగడాలను ఉపయోగించారో ఆరా తీశారు. వాటి కోసం ఏకంగా ఏడేళ్ల పాటు 9 రాష్ట్రాలు తిరిగారు. ఇప్పటివరకు 120 పురాతన కాలంలో వేసిన వంగడాలను సేకరించారు. ఫెస్టిసైడ్స్ వినియోగించని ఏరియాల్లో పండించిన పంటలు గురించి వాకబు చేసి సేకరించారు. సహజ సిద్దంగా సాగు చేస్తున్న ప్రాంతాల గురించి తెలుసుకుని అక్కడి రైతులతో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత విత్తనాలను సేకరించారు. తనకున్న 8 ఎకరాలతో పాటు మరో 20 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని 120 రకాల వరి సాగు చేస్తున్నాడు.

కొత్తకోణం ఆవిష్కరణ

శ్రీకాంత్ సేకరించిన వరి విత్తనాల కొత్తకోణం ఆవిష్కృతం అయింది. నేడు మార్కెట్ లో లభిస్తున్న రకాలకు నాడు సాగు చేసిన రకాలకు పొంతనలేదని స్పష్టం అవుతోంది. కడుపు నింపడానికి మాత్రమే అన్నట్టుగా మారిన అన్నం నాడు ఆరోగ్యాన్ని కూడా పంచిందని స్పష్టం అవుతోంది. శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఆహారంగి భుజించిన ‘బహురూపి’ అనే.రకం దేహదారుడ్యం కోసం తినేవారు. దాదాపు 5 వేళ ఏళ్ల క్రితం పండించిన ‘అంబే మోహర్’ అనే రకం బాలింతలు సమృద్దిగా పాలు అందించేందుకు దోహదపడుతుంది. ‘నారాయణ కామినీ’ అనే రకం బాడీ, జాయింట్ పెయిన్స్ ను తగ్గించేందుకు తినేవారు. ఇలా వేలాది రకాల వరి సాగు పూర్వకాలం చేసేవారు. అలాగే మొఘల్ రాజుల కాలంలోను వినియోగించిన మ్యాజిక్ రైస్ ఇప్పుడిప్పుడే ప్రాచూర్యం పొందుతున్నాయి. మొఘల్ రాజుల కాలంలో సైన్యానికి సులువుగా ఆహారం అందించే అవకాశం ఉంటుందని భావించి ఈ రకం ధాన్యాన్ని సరఫరా చేసేవారు. చల్లని నీటిలో అరగంట సేపు ఉంచితే చాలు అన్నంగా మారిపోయే ఈ రకం విత్తనాలను అస్సాంలోని ఓ మారుమూల ప్రాంతం నుండి శ్రీకాంత్ సేకరించారు.

ఏడేళ్ల క్రితం ప్రారంభించా..

ఏడేళ్ల క్రితం నా ప్రస్థానాన్ని ప్రారంభించా. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ అనామకుడిగా చూశారు. క్రమక్రమంగా ఒక్కొక్కరు నా వద్దకు వచ్చి తమకు వచ్చిన రోగం వివరించి ఏ రకం ధాన్యం తినాలి ఎక్కడ దొరుకుతాయనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. పూర్వకాలంలో సహజ సిద్ధంగా లభ్యమైన వనరులతో సాగు చేసే వారు. వంట, ఔషధ గుణాలు ఉన్న వన మూలికలను వినియోగించి ఆరోగ్యంగా ఉన్నారు. వాటిని నేటి, భావి తరాలకు అందించాలన్న నా సంకల్పం. భావి తరాలకు కూడా వీటి ప్రాముఖ్యత తెలిపేందుకు ఓ పుస్తకం కూడా రాస్తున్నాను. – శ్రీకాంత్, ఇల్లంతకుంట



Next Story