పెద్ద కూతురి ప్రాణం కోసం.. చిన్నకూతురి లైఫ్‌ను రిస్క్‌‌లో పడేసిన తల్లి!

by  |
పెద్ద కూతురి ప్రాణం కోసం.. చిన్నకూతురి లైఫ్‌ను రిస్క్‌‌లో పడేసిన తల్లి!
X

దిశ, వెబ్‌డెస్క్ : సృష్టిలో అత్యంత విలువైన వాటిలో తల్లి ప్రేమ ఒకటి. తండ్రి కుటుంబ భారాన్ని తనపై వేసుకుంటే.. పిల్లల పోషణతో పాటు బాగోగులు చూడటంలో తల్లి పాత్ర వర్ణించలేనిది. అలాంటిది తన పిల్లలకు ఏదైనా జరిగితే ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. వారిని కాపాడుకునేందుకు అనుక్షణం తపిస్తుంది. నవ మాసాలు కనిపెంచిన పిల్లలను రక్షించుకోవడానికి చివరి వరకూ ప్రయత్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పిల్లలకు రక్షణ కవచంలా నిలుస్తుంది. కానీ, ప్రస్తుతం కొందరు తల్లులు డబ్బులకు ఆశపడో లేదా ఇంట్లోని ఇబ్బందులను అధిగమించేందుకు క్షమించరాని నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా పెద్ద కూతురిని కాపాడుకునే క్రమంలో చిన్నకూతురి జీవితాన్ని రిస్క్‌లో పడేసింది ఓ మాతృమూర్తి.. ఇందులో ఆ తల్లి స్వార్థం కనిపించకపోయినా.. బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలన్న తపనే ఆమెను ఇలా చేసేందుకు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.

నెల్లూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనుకోకుండా వారి పెద్దకూతురు జబ్బు పడింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా టెస్టుల అనంతరం వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని డాక్టర్లు సెలవిచ్చారు. కూలి పనులు చేసుకునే దంపతులకు రూ.వేలకు వేలు వెచ్చించి తమ కూతురికి ట్రీట్‌మెంట్ ఇప్పించే స్థోమత లేదు.దీంతో కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తల్లి తల్లడిల్లింది. తెలిసిన వాళ్లను, చుట్టుపక్కల డబ్బులు సర్దాలని ప్రాధేయపడింది. వారి నుంచి స్పందన రాకపోవడంతో ఎవరూ ఊహించని డెసిషన్ తీసుకుంది. పెద్ద కూతురు(16 ఏళ్లు) వైద్యం కోసం ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది.

రూ.10 వేలకు తన చిన్నకూతురు (12ఏళ్ల)ను అమ్మడానికి సిద్ధపడింది. ఇదివరకే వివాహమై భార్య వదిలేసిన 46 ఏళ్ల వ్యక్తికి తన కూతురిని అమ్మేందుకు ఒకే చెప్పింది. అంతకుముందు బాధిత కుటుంబం దుస్థితిని తెలుసుకున్న ఆ వ్యక్తి మీ చిన్న కూతురిని పెళ్లి చేసుకుంటానని.. ప్రతిఫలంగా పెద్ద కూతురు వైద్యం కోసం రూ.10వేలు చెల్లిస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించిన ఆ తల్లి డబ్బులు తీసుకుని చిన్నకూతురిని అమ్మేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారమిచ్చారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి బాధితురాలిని కాపాడారు. బాలికను అమ్మేసిన నేరం కింద కుటుంబ సభ్యులను, మైనర్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిన అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు వారు తెలిపారు.



Next Story