పెద్దిరెడ్డి నుంచి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది: వైసీపీ మహిళా జెడ్పీటీసీ

111

దిశ, ఏపీ బ్యూరో : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పై ఆ పార్టీ జెడ్పీటీసీ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తంబళ్లపల్లి జెడ్పీటీసీ మద్ది రెడ్డి గీత ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాలతో తన భర్త మద్ది రెడ్డి కొండ్రెడ్డి పై అక్రమంగా ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఇంటికి వచ్చి అరెస్టు చేశారని గీత ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా అక్రమంగా అరెస్ట్ చేసిన తన భర్తను రాత్రి సమయంలో జడ్జి ముందు హాజరుపరచి మదనపల్లి సబ్ జైలుకు తరలించారని చెప్పుకొచ్చారు. అక్కడ పోలీసుల సాయంతో ఎమ్మెల్యే అనుచరులు తన భర్తకు ఏమైనా హాని తలపెట్టవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త కొండ్రెడ్డికి ఏం జరిగినా ప్రభుత్వం, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని జెడ్పీటీసీ గీత హెచ్చరించారు. తమ ఇంటికొచ్చే వారిని, జామీను ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారిని ఎమ్మెల్యే అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త అక్రమ అరెస్ట్‌పై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని గీత తెలిపారు. తంబళ్లపల్లిలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆగడాలకు అంతే లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. తమకు ఎవరు అడ్డు వచ్చినా కొండ్రెడ్డి కి పట్టిన గతే పడుతుందంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జెడ్పీటీసీ విలపించారు.

ప్రభుత్వమే తమదంటూ అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి కంటే ముందునుండే తాము వైసీపీలో ఉన్నామని మా తర్వాత ఆయన వైసీపీ నాయకుడు అయ్యాడని గుర్తు చేశారు. వైసీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నామని 2013 లో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచామని గుర్తుచేశారు. ప్రస్తుతం జెడ్పీటీసీ గా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా పార్టీని వీడలేదని చెప్పుకొచ్చారు. తంబళ్లపల్లె పంచాయతీ ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన అభ్యర్థులు విజయం సాధించడంతో అది మనసులో పెట్టుకుని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అక్రమంగా ఫోర్జరీ, 420 కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైసీపీ జెడ్పీటీసీ మద్ది రెడ్డి గీత ఆవేదన వ్యక్తం చేశారు.