రోజాదే పైచేయి.. పంతం నెగ్గించుకున్న ఫైర్‌బ్రాండ్

by  |
roja
X

దిశ, ఏపీ బ్యూరో: ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. నిండ్ర ఎంపీపీ పీఠంపై వర్గపోరులో రోజా పైచేయి సాధించారు. అధిష్టానం రోజాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో రోజా ప్రతిపాదించిన అభ్యర్థినే శుక్రవారం ఎంపీపీగా ఇరువర్గాలు ఎన్నుకున్నాయి. ఎమ్మెల్యే రోజా సూచించిన దీపను ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపోతే నిండ్ర ఎంపీపీ ఎన్నిక ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. నిండ్ర ఎంపీపీ విషయంలో రోజా ప్రతిపాదించిన అభ్యర్థిని చక్రపాణిరెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. చక్రపాణిరెడ్డి సోదరుడు భాస్కర్‌రెడ్డి తనకే ఎంపీపీ పదవి ఇవ్వాలంటూ పట్టుపట్టుకుని కూర్చున్నారు. ఎంపీపీ విషయంలో అటు చక్రపాణిరెడ్డి వర్గం..ఇటు రోజా వర్గం సై అంటే సై అనుకున్నాయి.

విమర్శలు..ప్రతివిమర్శలతో నగరి రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. మగాడివైతే పోటీ చేయ్ అని రోజా సవాల్ విసిరితే.. రోజాకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో తలపడి గెలవాలంటూ చక్రపాణి రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక అక్టోబర్ 8కు వాయిదా వేసింది. అనంతరం రోజా చక్రపాణిరెడ్డి వర్గీయులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారిని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చక్రపాణిరెడ్డి వర్గీయులు సైతం రోజాపై ఫిర్యాదు చేశారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా సూచించిన దీపను ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్ ఎంపీపీగా దుర్గా భవానీని ఎన్నుకున్నారు. నిండ్ర ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా ఎన్నికైన వారితో పాటు ఎంపీటీసీ సభ్యులను రోజా సన్మానించారు. సీఎం జగన్ ఆదేశానుసారం ఎంపీపీ ఎన్నిక జరిగిందని ఎమ్మెల్యే రోజా తెలిపారు.


Next Story

Most Viewed