రాష్ట్రాన్ని తనఖా పెట్టేందుకు వైసీపీ కుట్రలు

by  |
Ashok Gajapatiraju
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు అశోక్ గజపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల మంటతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వైషమ్యాలు లేకుండా పనిచేయాలని సూచించారు. గ్యాస్ ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కొన్ని విషయాల్లో స్ఫూర్తిగా నిలిస్తున్నా మరికొన్ని విషయాల్లో మాత్రం విమర్శల పాలవుతున్నారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు చేయలేదు కాబట్టే అప్పట్లో తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో అసలు తెలుగు భాష లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచమంతా తల్లి భాషలోనే విద్య కొనసాగుతోందని… కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా సౌకర్యాలను తాకట్టు పెడుతోందని.. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదని ధ్వజమెత్తారు. స్కూల్, ఆస్పత్రులాంటి ప్రజా సౌకర్యాలను తాకట్టు పెట్టె ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాలను తాకట్టు పెట్టగలరా అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు.


Next Story

Most Viewed