వారిని వెంటనే అరెస్ట్ చేయండి.. మృతదేహాలతో రోడ్డుపై ధర్నా

by  |
victim-Family-members
X

దిశ, కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రగేటు సమీపంలో బైక్‌ను కారు ఢీ కొనడంతో యాతం యాదయ్య(50) మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో భార్య కమలమ్మ, మనవడు అభిజిత్‌కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన 10 నిముషాలకే అభిజిత్ (10) కూడా మృతి చెందడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్‌నగర్ కూడలిలో యాదయ్య, అభిజిత్ మృతదేహాలతో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. కారుతో బైకును ఢీకొట్టి పరారైన వారిని 24 గంటలు గడుస్తున్నా.. ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను నిలదీశారు.

ప్రమాదానికి కారకులైనవారు అధికార పార్టీ నాయకుల బంధువు అయినందునే పోలీసులు అరెస్ట్ చేయడం లేదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితున్ని వెంటనే అదుపులోకి తీసుకొని మాముందుకు తీసుకురావాలని, మాకు న్యాయం జరిగేవరకు ఇక్కడినుంచి కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. మృతుని భార్య కమలమ్మ కూడా కారు ప్రమాదంలో కాలు, చెయ్యి విరిగి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారకులైన వారిని చట్టప్రకారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని, ధర్నాను విరమించాలని సీఐ సైదులు, SI లు మహేందర్, విజయ్ కుమార్, బాలక్రిష్ణలు వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.



Next Story

Most Viewed