యాదాద్రి దర్శనానికి ఏర్పాట్లు చకచకా

by  |
యాదాద్రి దర్శనానికి ఏర్పాట్లు చకచకా
X

దిశ, నల్లగొండ: ఈ నెల 8 నుంచి లక్ష్మీనరసింహస్వామి దర్శనంతోపాటు ఆర్జిత పూజల నిర్వహణ కోసం భక్తజనానికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తుల రాకకోసం యాదాద్రి సకల సౌకర్యాలతో సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం వివిధశాఖల అధికారులతో ఆలయ ఈవో గీతారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వామి దర్శనానికొచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన దర్శనాలు ఈ నెల 8 నుంచి పునఃప్రారంభంకానున్నాయని, కొండ కింది నుంచి పై వరకు కాలినడకన వెళ్లే భక్తులు భౌతికదూరం పాటించేలా నిర్ణీత బాక్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ముందుగా వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా దర్శనాల ప్రక్రియను పర్యవేక్షిస్తామని చెప్పారు. యాదాద్రి కొండపై కరోనాకు ముందు.. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారమని, కానీ, ఈ నెల 8 నుంచి ఒక్కో బ్యాచ్‌లో 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీవారి కల్యాణం జరిపించుకునేందుకు గతంలో 200 మంది దంపతులను అనుమతించేవారమని, ప్రస్తుతం 25 మంది దంపతులే కూర్చునేలా టికెట్లు ఇవ్వనున్నామని వెల్లడించారు. దర్శనాలు గత టైంటేబుల్‌ ప్రకారమే జరుగుతాయని ఆమె వివరించారు. దర్శనాలకు పదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లుపైబడిన వృద్ధులకు అనుమతిలేదని ఈవో గీత స్పష్టం చేశారు. ఈ విషయంపై దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలిపారు. అనంతరం ఆమె కొండపై ఏర్పాట్లను పరిశీలించి.. పలు సూచనలుచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఏఈవోలు దోర్బల భాస్కర్‌, ఆకునూరి చంద్రశేఖర్‌, వేముల రామ్మోహన్‌రావు, జూశెట్టి కృష్ణాగౌడ్‌, మేడి శివకుమార్‌, గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రావణ్‌కుమార్‌, రాజన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.



Next Story