WTC: నేడే మహాసంగ్రామం.. విశ్వవిజేత ఎవరో?

by  |
India-vs-New-Zealand
X

దిశ, స్పోర్ట్స్: ఆటైనా.. యుద్ధమైనా.. ఎలాంటి పోటీ అయినా గెలిచే వాడికే జేజేలు. చరిత్రలో ఏదైనా మొట్ట మొదట సాధించిన వాడినే గుర్తుపెట్టుకుంటారు. మొట్ట మొదటి వన్డే వరల్డ్ కప్ ఎవరు గెలిచారంటే.. వెస్టిండీస్ అని టక్కున గుర్తొస్తుంది. టీ20 వరల్డ్ కప్ అనగానే ధోనీ సేన తొలిసారి గెలిచిన కప్పే అందరి కళ్ల ముందు మెదులుతుంది. ఇక నుంచి ప్రతీ రెండేళ్లకూ WTC ఫైనల్ జరుగబోతోంది. కానీ మొట్టమొదటి సారి ఆ ట్రోఫీ గెలిచిన ఘనత మాత్రం చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఇప్పుడు మొట్ట మొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌‌గా నిలవడానికి ఇండియా, న్యూజీలాండ్ జట్లకు అవకాశం వచ్చింది. శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా ఇండియా, న్యూజీలాండ్ జట్లు రోజ్ బౌల్ స్టేడియంలో కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. రెండేళ్ల పాటు పలు ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లు ఆడిన ఇరు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 2గా నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్ అనే కాకుండా ఈ మ్యాచ్ కెప్టెన్ కోహ్లీ, కేన్ విలియమ్‌సన్‌కు కూడా చాలా కీలకమైనది. తటస్థ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్, పిచ్ నుంచి వాతావరణం కూడా కీలకంగా మారనున్నది. సమఉజ్జీల మధ్య జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో ఏ జట్టు విశ్వవిజేతగా నిలుస్తుందా? అని ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

team-india-2

ఓపికతో ఆడాల్సిందే..!

పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే ఎంతో విభిన్నమైన టెస్టు మ్యాచ్‌ను ఓపికతో ఆడే వారినే గెలుపు వరిస్తుంది. ప్రతీ సెషన్‌లో పై చేయి సాధించాడనికి ఇరు జట్లు ప్రయత్నిస్తుంటాయి. ఎవరు ఎక్కువ సెషన్లు గెలుచుకుంటే చివరికి విజయం వారినే వరిస్తుంది. ఉపఖండం, న్యూజీలాండ్ పిచ్‌లతో పోల్చుకుంటే ఇంగ్లాండ్ పిచ్‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇరు జట్లు ఇక్కడ ఆతిథ్య జట్లే కావడంతో ఐసీసీ మార్గనిర్దేశనంలో క్యూరేటర్ సైమన్ లీ ప్రత్యేక శ్రద్దతో వికెట్ రూపొందించారు. తొలి రోజుల్లో పేసర్లకు అనుకూలించే ఈ పిచ్ సమయం గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. మొత్తానికి ఈ వికెట్ బౌలర్లకు స్వర్గధామంలా ఉంటుంది. కాబట్టి ప్రతీ బ్యాట్స్‌మెన్ ఓపికతో ఆడితే కాని పరుగులు రాబట్టలేడు. ఈ వికెట్‌పై బంతి బౌన్స్ అవడమే కాకుండా అనూహ్యంగా స్వింగ్ అవుతుంది. ఎత్తుగా ఉండే ఇషాంత్ శర్మ, కైల్ జేమిసన్ వంటి బౌలర్లకు ఈ పిచ్ చక్కగా సహకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక చివరి రోజుల్లో ఇండియా కనుక బౌలింగ్ చేయాల్సి వస్తే అశ్విన్, జడేజాలు మంచి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. యార్కలు విసిరే బుమ్రా, బౌల్డ్ వంటి బౌలర్లకు ఈ పిచ్ స్వర్గధామమే అనుకోవచ్చు. మొదటి రోజు నుంచే బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై ఓపికతో ఆడే పుజార, రహానే వంటి బ్యాట్స్‌మెన్‌ తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ ముందు నుంచే భారీ షాట్లకు యత్నించకుండా కాస్త క్రీజులో కుదురుకునే వరకు బంతిని గమనించాలని సీనియర్లు సలహాలు ఇస్తున్నారు.

team-india

వీళ్లే కీలక ఆటగాళ్లు..

న్యూజీలాండ్, టీమ్ ఇండియాలోని కొంత మంది క్రికెటర్లపై అందరి చూపులూ ఉన్నాయి. టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ, పుజార, ఇషాంత్ శర్మలు కీలకంగా మారే అవకాశం ఉన్నది. ఇండియా ముగ్గురు పేసర్లతో ఆడే అవకాశం ఉన్నది. అందులో కనుక ఇషాంత్ శర్మకు కనుక చోటు దక్కితే అతడు తప్పకుండా కీలక పాత్ర పోషిస్తాడు. ఇక టాపార్డర్‌లో కోహ్లీ, పుజార తమ బ్యాటుకు పనిచెప్పాల్సి ఉన్నది. విదేశీ పిచ్‌లపై చెలరేగిపోయే అజింక్య రహానే కూడా భారత బ్యాటింగ్‌కు వెన్నెముక లాంటి వాడే. ఇక కివీస్ జట్టులో కేన్ విలియమ్‌సన్, ట్రెంట్ బౌల్ట్ మ్యాచ్‌ను మార్చగలిగే సత్తా కలిగిన క్రికెటర్లు. కేన్ విలియమ్‌సన్‌కు టెస్టు మ్యాచ్‌లలో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలడు. బౌల్ట్ కీలక సమయాల్లో వికెట్లు రాబట్టి ప్రత్యర్థి జట్టును చిత్తు చేయగలడు. వీరిద్దరిని టీమ్ ఇండియా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. విరాట్-బౌల్ట్, విలియమ్‌సన్-బుమ్రా మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గత కొన్ని సిరీస్‌లుగా ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్న రిషబ్ పంత్‌ను కివీస్ బౌలర్లు తప్పక టార్గెట్ చేస్తారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ చేసిన డెవాన్ కాన్వేను త్వరగా ఔట్ చేయకపోతే పెద్ద నష్టమే జరగవచ్చు.

వాతావరణం ఎలా ఉంది?

సౌతాంప్టన్ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలు కాకుండా చిరు జల్లులకే పరిమితం అవుతాయని పేర్కొన్నది. వర్షం కారణంగా సమయం కోల్పోయినా దాన్ని జూన్ 23న రిజర్వ్ డే రోజు వాడుకునే అవకాశం ఉన్నది. అయితే వర్షం పడిన తర్వాత రోజ్ బౌల్ స్టేడియంలోని పిచ్ అనూహ్యంగా బౌన్ అవుతూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

గత రికార్డు :

రోజ్ బౌల్ స్టేడియంలో ఇప్పటి వరకు 6 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు, మొదట బౌలింగ్ చేసిన జట్టు ఒకసారి గెలుపొందాయి. ఇక్కడి పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 337, రెండో ఇన్నింగ్స్ సగటు స్కోర్ 280, మూడో ఇన్నింగ్స్ స్కోర్ 262, నాలుగోఇన్నింగ్స్ సగటు స్కోరు 187గా ఉన్నది. గత ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 583 పరుగులు చేసింది. అదే అత్యధిక స్కోరు. ఇక 2014లో ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియా 178 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇదే అత్యల్ప స్కోర్. టీమ్ ఇండియా ఈ మైదానంలో ఆడిన ఏకైక మ్యాచ్ ఓడిపోయింది.

తుది జట్లు అంచనా..

ఇండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా

న్యూజీలాండ్ : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్‌సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోలస్, బీజే వాట్లింగ్ (వికెట్ కీపర్), కేల్ జేమిసన్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్

మ్యాచ్ : ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్
జట్లు : ఇండియా Vs ఇంగ్లాండ్
వేదిక : రోజ్ బౌల్ స్టేడియం, సౌతాంప్టన్
సమయం : మధ్యాహ్నం 3.30 గంటలు
లైవ్ : స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు
స్ట్రీమింగ్ : డిస్నీ+హాట్‌స్టార్

Next Story