'త్వరలో మరో మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకంగా ఉండొచ్చు'.. డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్

by Vinod kumar |
త్వరలో మరో మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతకంగా ఉండొచ్చు.. డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్
X

జెనీవా: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’(డబ్ల్యూహెచ్‌ఓ) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. త్వరలోనే మరో మహమ్మారి రావొచ్చని హెచ్చరించింది. 76వ ప్రపంచ ఆరోగ్య సభకు తన నివేదికను సమర్పించిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే మరో మహమ్మారి రావొచ్చని, అది కరోనా కంటే ప్రాణాంతకంగా ఉండొచ్చని, కాబట్టి, దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. కరోనా ముగిసినంత మాత్రనా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ముగిసినట్టు కాదని తెలిపారు.

‘సరికొత్త వ్యాధులు, మరణాల పెరుగుదలకు కారణమయ్యే మరో వ్యాధికారక వేరియంట్ ఉద్భవించే ముప్పు ఉంది. ఇది కరోనా కంటే ప్రాణాంతకంగా ఉండొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు తక్షణమే ప్రతిస్పందించి, పరిష్కరించేలా ప్రభావవంతమైన అంతర్జాతీయ యంత్రాంగం అవసరమని నొక్కి చెప్పారు. మరో మహమ్మారి మన ప్రపంచం తలుపు తట్టినప్పుడు, దానికి నిర్ణయాత్మకంగా, సమిష్టిగా, సమానంగా సమాధానం ఇచ్చేలా ఆ యంత్రాంగం ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ పంపిణీలో పేద దేశాల పట్ల వివక్ష చూపిన నేపథ్యంలో టెడ్రోస్ ఈ సూచన చేశారు. అలాగే, కరోనా మనల్ని దెబ్బతీసినప్పటికీ, ఆరోగ్య రంగానికి ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పారు.

Next Story

Most Viewed