పపువా న్యూగినియాలో తీవ్ర విషాదం: 300కు చేరిన మృతుల సంఖ్య

by samatah |
పపువా న్యూగినియాలో తీవ్ర విషాదం: 300కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: పపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 300కు చేరుకున్నట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే 1100కు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పపువా న్యూగినియాలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రావిన్స్‌లోని ములిటాకా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆరుకు పైగా గ్రామాలు ప్రభావితమైనట్లు ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు, వాణిజ్య శాఖ తెలిపింది. ‘ఆస్తి నష్టం, ప్రాణనష్టంపై తదుపరి అంచనాల కోసం పోర్ట్ మోర్స్బీలోని ఆస్ట్రేలియా హైకమిషన్ అధికారులతో టచ్‌లోనే ఉన్నాం’ అని పేర్కొంది.

కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో హెలికాప్టర్లతో మినహా బాధిత గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు రాళ్లు, నేలకూలిన చెట్లు, మురికి గుట్టల మీద నుంచి ఆర్తనాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విపత్తు అధికారులు పునరుద్ధరణ ప్రయత్నాలకు సహాయం చేస్తున్నాయని ప్రధాన మంత్రి జేమ్స్ మరాపే తెలిపారు. ప్రాణనష్టానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే విడుదల చేస్తామన్నారు.

కాగా, శుక్రవారం తెల్లవారుజామున రాజధాని పోర్ట్ మోర్స్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అయితే పపువా న్యూగినియాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా ప్రకటించింది. కౌకలం గ్రామం ప్రజలకు సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తెలిపారు.

Next Story