పాక్ నూతన అధ్యక్షుడి కీలక నిర్ణయం: వేతనం వదులుకోనున్న జర్దారీ!

by Dishanational2 |
పాక్ నూతన అధ్యక్షుడి కీలక నిర్ణయం: వేతనం వదులుకోనున్న  జర్దారీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ నూతన అధ్యక్షుడు అసిఫ్ అలా జర్ధారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడి హోదాలో లభించే వేతనాన్ని వదులుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ డెసిషన్ తీసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుత ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, అధ్యక్షుడు జర్దారీ తన అధ్యక్ష వేతనాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు’ పేర్కొంది. అలాగే జర్థారీ పార్టీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఎక్స్ వేదికగా స్పందించింది. ‘దేశానికి సహాయం చేయడానికి అధ్యక్షుడు జర్దారీ తన పదవీ కాలంలో ఎలాంటి జీతం తీసుకోరు. ఆర్థిక నిర్వహణ, జాతీయ ఆదాయంపై భారం పడకూడదని ఉద్దేశంతోనే వేతనాన్ని వదులుకున్నారు’ అని తెలిపింది.

మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ప్రతి నెలా సుమారు 8లక్షల 46వేల జీతం వచ్చేది. ఈ వేతనాన్ని 2018లో పాక్ పార్లమెంట్ నిర్ణయించింది. కాగా, పీపీపీ పార్టీ కో చైర్మన్ గా ఉన్న జర్ధారీ మార్చి 9న అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా మరుసటి రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు జర్ధారీ 2008 నుంచి 2013 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. రెండోసారి దేశాధినేతగా ఎన్నికైన ఏకైక పౌర అభ్యర్థి జర్దారీ కావడం గమనార్హం. ఎన్నికైన కొద్ది రోజులకే ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించిన జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం వేతనం తీసుకోబోనని ప్రకటించారు.

Next Story

Most Viewed