ఖార్కివ్‌లోని హార్డ్‌వేర్ స్టోర్‌పై రష్యా దాడి..ఆరుగురు మృతి

by samatah |
ఖార్కివ్‌లోని హార్డ్‌వేర్ స్టోర్‌పై రష్యా దాడి..ఆరుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నా.. ఉక్రెయిన్ పై దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉక్రెయిన్ లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో నిరంతరం రద్దీగా హార్డ్‌వేర్ స్టోర్‌పై రష్యా దాడి చేసింది. రెండు గైడెడ్ బాంబులతో స్టోర్‌పై విరుచుకుపడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 40 మందికి పైగా గాయపడ్డట్టు ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సినీహుబోవ్ తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు స్టోర్ ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించారు. అలాగే క్షతగాత్రులైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మరో16 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని చెప్పారు.

దాడి సమయంలో దాదాపు 120 మంది హార్డ్‌వేర్ స్టోర్‌లో ఉన్నారని ఖార్కివ్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ తెలిపారు. ఈ దాడి షాపింగ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. దీనిని ఉగ్రవాద చర్యలు గానే చూడాలని స్పష్టం చేశారు. దాడి తర్వాత షాపింగ్ సెంటర్ మీదుగా ఆకాశంలోకి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయని, దీంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని తెలిపారు. 90 నిమిషాల్లో పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చాయని వెల్లడించారు. కాగా, కొన్ని రోజులుగా ఖార్కివ్ నగరంపై అనేక దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పాశ్చాత్య దేశాలను మరోసారి కీలక విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ సిటీలను సురక్షితంగా ఉంచడానికి వాయు రక్షణను పెంచడంలో సహాయం చేయాలని కోరారు. ఆయుధాల సరఫరాను వేగవంతం చేయాలని తెలిపారు. ఉక్రెయిన్‌కు తగినంత వైమానిక రక్షణ అవసరమని నొక్కి చెప్పారు. మరోవైపు రష్యా తాజా దాడిని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఖండించారు. హర్డ్ వేర్ స్టోర్‌పై దాడి చేయడం ఆమోదయోగ్యం కాదని ఎక్స్‌లో పోస్టు చేశారు.x

Next Story

Most Viewed