ఎట్టకేలకు నావల్నీ మృతదేహం అప్పగింత

by Dishanational5 |
ఎట్టకేలకు నావల్నీ మృతదేహం అప్పగింత
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజకీయ విరోధి, ఆ దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులకు అందజేశారు. రష్యాలోని అత్యంత కఠినమైన కారాగారాల్లో ఒకటైన ఉత్తర సైబీరియాలోని ఆర్టిక్ జైల్లో ఈ నెల 16న నావల్నీ అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతన్ని మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించేందుకు అధికారులు నిరాకరిస్తూ వచ్చారు. అయితే, ఎట్టకేలకు శనివారం తన తల్లికి మృతదేహాన్ని అప్పగించారు. ఈ విషయాన్ని నావల్నీ స్థాపించిన యాంటీ- కరప్షన్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇవాన్ ఝదనోవ్ వెల్లడించారు. మృతదేహాన్ని అప్పగించడానికి ముందు, శనివారం ఉదయం నావల్నీ భార్య యులియా నావల్నియా పుతిన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రహస్య అంత్యక్రియలు జరిపేందుకు నావల్నీ తల్లిని బలవంతంగా ఒప్పించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని, దీని ద్వారా అతను క్రైస్తవ మతాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. అందులో యులియా మాట్లాడుతూ.. ‘‘తన కొడుకు మృతదేహాన్ని కావాలని నావల్నీ తల్లి అడుగుతుతోంది. కానీ, అధికారులు మాత్రం జైల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని బెదిరిస్తూ ఆమెను హింసిస్తున్నారు. నా భర్త మృతదేహాన్ని ఇప్పటికైనా అప్పగించండి. అతన్ని బతికుండగానే హింసించారు. ఇప్పుడు, చనిపోయిన తర్వాత కూడా చిత్రవధలకు గురిచేస్తున్నారు. మీరు చనిపోయినవారి శరీరాన్నీ అవమానిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పుతిన్‌పై తరచూ విమర్శల దాడికి దిగే నావల్నీ(47).. పలు కేసులతో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న ఆయన గుండెపోటుతో మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పేరుతో కుటుంబ సభ్యులను అప్పగించలేదు. దీంతో నావల్నీ మద్దతుదారులు పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నావల్నీ మృతదేహాన్ని అప్పగించాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కాగా నావల్నీ అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశం ఉంది.Next Story

Most Viewed