జీ20 దేశాధినేతల సదస్సుకు బాలి చేరుకున్న భారత్ ప్రధాని

by Disha Web Desk 21 |
జీ20 దేశాధినేతల సదస్సుకు బాలి చేరుకున్న భారత్ ప్రధాని
X

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. బాలిలో నవంబర్ 15,16 తేదీల్లో జరగనున్న జీ20 దేశాధినేతల సదస్సు కోసం ప్రధాని ఒక రోజు ముందే అంటే సోమవారమే బాలి చేరుకున్నారు. జి20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ మినహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కోల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా ఈ కీలక సదస్సుకు హాజరు కానున్నారు. జీ20 దేశాల కూటమి 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులోనే ఇండోనేషియా నుంచి సారధ్య బాధ్యతలను భారత్ అందుకోనుందని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు.

జీ20 కూటమిలోని దేశాధినేతలతో ప్రధాన మోడీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రత్యేకించి భారత సంతతి బ్రటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోడీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కలిసి కోలుకుందాం, బలంగా కోలుకుందాం అనే థీమ్ కింద ఈ సదస్సులో పలు సెషన్లు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా బాలిలోని భారతీయులతో మోడీ సమావేశమై ప్రసంగించనున్నారు.

డిసెంబర్ 1 నుంచి జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతను భారత్ స్వీకరించనుంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 కూటమి సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ జీడీపీలో 85 శాతానికి, మూడింట రెండొంతుల జనాభాకుప్రాతినిధ్యం వహిస్తున్న జీ20 కూటమి అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి సంబంధించి అతి ముఖ్యమైన వేదికగా పేరొందింది.

బాలిలో చేతులు కలిపిన జో బైడెన్, షీ జిన్ పింగ్

జీ20 దేశాల సదస్సు సందర్భంగా బాలి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సోమవారం పరస్పరం కరచాలనం చేశారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా రూపొందిన అమెరికా, చైనా దేశాధినేతలు మూడేళ్ల తర్వాత పరస్పరం చేతులు కలపడం విశేషం. కాగా తమ మధ్య పెరుగుతున్న విభేదాలను కలిసి పరిష్కరించుకుంటామని, ఘర్షణ వైఖరిని విడనాడతామని ఇరు దేశాధినేతలు ఆశాభావం వ్యక్తపరిచారు. తైవాన్ తదితర సమస్యలపై ఇరుదేశాల మధ్య నెలల తరబడి ఉద్రిక్తతలు పొడసూపిన తరుణంలో అమెరికా, చైనా అధినేతల మధ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

బాలి రిసార్డులో ఒక టేబుల్ వద్ద పక్క పక్కనే కూర్చున్న బైడెన్, జిన్‌పింగ్‌లు ఘర్షణల నుంచి తలెత్తుతున్న పోటీ వాతావరణాన్ని అడ్డుకుంటామని, విభేదాలను పరిష్కరించుకుంటామని చెప్పారు. చైనా, అమెరికాలు ఇప్పటికీ తమ మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునే స్థితిలో ఉన్నాయని ప్రపంచం భావిస్తోందని జిన్ పింగ్ తెలిపారు. మరోవైపున అగ్రరాజ్య బాధ్యతలు చేపట్టాక జిన్‌పింగ్‌ని తొలిసారి నేరుగా కలిసిన బైడెన్ తమగురించి పరస్పరం తెలుసని చెప్పారు. ఇరు దేశాల మధ్య లక్ష్మణ రేఖలు ఎక్కడున్నాయో, ఇరుదేశాలకు అత్యంత ముఖ్యమైన విషయాలేమిటో గుర్తించి ముందడుగు వేస్తామని చెప్పారు.


Next Story