తైవాన్ సరిహద్దుల్లో సైనిక కసరత్తులు: కవ్వింపు చర్యలకు దిగిన చైనా

by samatah |
తైవాన్ సరిహద్దుల్లో సైనిక కసరత్తులు: కవ్వింపు చర్యలకు దిగిన చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్-తే బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. తైవాన్ సరిహద్దు చుట్టూ గురువారం సైనిక కసరత్తులు ప్రారంభించింది. తైవాన్ జలసంధిలో, చైనా తీరానికి పక్కనే ఉన్న తైవాన్-నియంత్రిత ద్వీపాల సమూహాల చుట్టూ వ్యాయామాలు నిర్వహించినట్టు తైపీ అధికారులు తెలిపారు. తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం 7.45 గంటలకు సైన్యం, నావికాదళం, వైమానిక దళంతో సంయుక్త సైనిక కసరత్తులు ప్రారంభించినట్టు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ నియంత్రణలో ఉన్న కిన్‌మెన్, మట్సు, వుకియు, డోంగ్యిన్ దీవుల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ డ్రిల్‌లు నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. తైవాన్ చుట్టూ 12 నౌకలు, ఒక విమానాన్ని మోహరించినట్టు పేర్కొన్నారు.

ఈ కసరత్తులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా ధ్రువీకరించింది. తైవాన్ చుట్టూ క్షిపణులను మోసుకెళ్లే డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లను పంపామని, యుద్ధనౌకలతో పాటు అధిక విలువ కలిగిన సైనిక లక్ష్యాలను మాక్ డ్రిల్స్ చేశామని ప్రకటించింది. రెండు రోజుల పాటు సాగే ఈ కసరత్తుల్లో తమ పోరాట సామర్థ్యాలను పరీక్షించేందుకు ద్వీపం చుట్టూ ఉన్న సైనిక విమానాలు, నౌకాదళ నౌకలు పాల్గొంటాయని వెల్లడించింది. అయితే తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ కసరత్తులను ఖండించింది. చైనా చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని పేర్కొంది. తైవాన్ తన భద్రతకు హామీ ఇవ్వగలదని వెల్లడించింది.

కాగా, తైవాన్ అధ్యక్షుడిగా ఇటీవల లైచింగ్-తే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైనా తన బెదిరింపులను ఆపాలని పిలుపునిచ్చారు. తైవాన్ రక్షణ సామర్థ్యాలను మరింత పెంపొందిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే లైచింగ్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. తైవాన్ నూతన అధ్యక్షుడిని ప్రమాదకరమైన వేర్పాటు వాదిగా ప్రకటించింది. ఆయన ప్రసంగానికి బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే సైనిక కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే దీనిని ముందే ఊహించామని అమెరికా వ్యాఖ్యానించింది.

Next Story

Most Viewed