ఇండోనేషియాలో భీకరంగా బద్దలైన లెవోటోబి అగ్నిపర్వతం

by Ramesh Naini |

ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న లెవోటోబి అగ్నిపర్వతం తీవ్ర స్థాయిలో బద్దలైంది.

ఇండోనేషియాలో భీకరంగా బద్దలైన లెవోటోబి అగ్నిపర్వతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న లెవోటోబి (Lewotobi) అగ్నిపర్వతం తీవ్ర స్థాయిలో బద్దలైంది. అక్కడి అగ్నిపర్వత పరిశోధనా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది వరుసగా తొమ్మిది సార్లు పేలడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ పేలుళ్ల ధాటికి సుమారు 3.8 కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన బూడిద ఆకాశంలోకి ఎగజిమ్మింది. ఫ్లోరెస్ ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం గత శుక్రవారం నుంచి అత్యంత చురుగ్గా మారుతూ వస్తోంది. సోమవారం ఎనిమిది సార్లు, మంగళవారం కనీసం ఆరుసార్లు పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అగ్నిపర్వత పరిసరాల్లో రెండో అత్యున్నత స్థాయి అలర్ట్‌ను కొనసాగిస్తోంది.

బురద ప్రవాహాల ముప్పు.. నిషేధిత ప్రాంతం

భద్రతా చర్యల్లో భాగంగా అగ్నిపర్వతం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా (Exclusion Zone) ప్రకటించారు. భారీ వర్షాలు కురిస్తే అగ్నిపర్వత వ్యర్థాలతో కూడిన ప్రమాదకరమైన బురద ప్రవాహాలు (Lahar flows) ముంచెత్తే ప్రమాదం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

విమానాశ్రయం పునరుద్ధరణ

దట్టంగా కమ్ముకున్న బూడిద కారణంగా అగ్నిపర్వతానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థానిక విమానాశ్రయాన్ని మూసివేశారు. అయితే, పరిస్థితులు కాస్త కుదుటపడటంతో మంగళవారం ఉదయం విమాన రాకపోకలను తిరిగి పునరుద్ధరించారు. ఇండోనేషియా భౌగోళికంగా పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (Ring of Fire) లో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయన్న విషయం తెలిసిందే.

Next Story