పాక్‌లో కీలక పరిణామం: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నవాజ్, బిలావల్

by samatah |
పాక్‌లో కీలక పరిణామం: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నవాజ్, బిలావల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ లాహోర్‌లో పీఎన్‌ఎల్-ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో దేశంలో కలిసి కట్టుగా పనిచేయడానికి ఇరు పార్టీలు అంగీకరించినట్టు తెలుస్తోంది. పాక్ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం లేదని వెల్లడైంది..ఈ నేపథ్యంలోనే పార్టీల నిర్ణయం వెలువడడం గమనార్హం. ‘పంజాబ్‌లో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నవాజ్, భుట్టోలిద్దరూ అంగీకరించారు. వచ్చే సమావేశంలో తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఎవరు ఏ పదవిని చేపట్టాలనే దానిపై అధికార భాగస్వామ్య సూత్రానికి సంబంధించిన అన్ని విషయాలను ఖరారు చేస్తాం’ అని పీపీపీ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, పాకిస్థాన్ పార్లమెంటులో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 134 స్థానాల్లో మెజారిటీ అవసరం. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో పీఎంఎల్-ఎన్ 71, పీపీపీ 53 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మిగతా సీట్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకోగా.. ఇంకా 15 స్థానాల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

Next Story