ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి..డ్రోన్లు, క్షిపణులతో అటాక్: యూఎన్ఓ అత్యవసర సమావేశం

by samatah |
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి..డ్రోన్లు, క్షిపణులతో అటాక్: యూఎన్ఓ అత్యవసర సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరించిన ఇరాన్..అన్నట్టుగానే ఇజ్రాయెల్ పై దాడిని ప్రారంభించింది. శనివారం అర్ధరాత్రి 200కు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. దీనిని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ధ్రువీకరించారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయెల్ గగన తలంలోకి రాగానే భారీ శబ్దాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన కొన్ని డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చి వేసినట్టు హగారీ వెల్లడించారు. సిరియా, జోర్డాన్‌లలో కొన్ని డ్రోన్‌లు పేల్చివేసినట్టు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు ఇరాన్ డాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షిస్తామని అమెరికా తెలిపింది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: నెతన్యాహు

ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి తమ దేశం సిద్ధమవుతోందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఇరాన్ దాడి తర్వాత ఆయన ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ బలంగా ఉందని నొక్కి చెప్పారు. రక్షణ వ్యవస్థలను గగనతలంలో మోహరించినట్టు తెలిపారు. ఇరాన్ దాడిని బ్రిటన్ ప్రధాన మంత్రి రిషిసునాక్ ఖండించారు. జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ కూడా ఇరాన్ దాడిని ఖండించాయి. ఈ దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

శాంతి యుతంగా పరిష్కరించుకోవాలి: భారత్

ఇరాన్ ఇజ్రాయెల్‌లు సమస్యను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న వివాదం ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పుగా ఉంది. తక్షణమే ఉద్రిక్తతను ముగించి హింసను ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇరు దేశాలు దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలి’ అని పేర్కొంది. రెండు దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయ పౌరులతో టచ్‌లో ఉన్నట్టు తెలిపింది. కాగా, ఈ నెల 1న సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ తాజాగా దాడి చేసింది.



Next Story

Most Viewed