భారత సంతతి వ్యక్తిని ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌గా నామినేట్ చేసిన అధ్యక్షుడు బైడెన్

by Disha Web Desk 17 |
భారత సంతతి వ్యక్తిని ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌గా నామినేట్ చేసిన అధ్యక్షుడు బైడెన్
X

వాషింగ్టన్: ఇండో-అమెరికన్ వ్యోమగామి రాజా చారి యుఎస్ వైమానిక దళంలో కీలక పదవికి నామినేట్ అయ్యారు. రాజా చారిని గ్రేడ్ ఆఫ్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌ పదవికి అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు. ఈ పదవికి నామినేషన్స్ ప్రక్రియ గురువారమే జరిగింది. యూఎస్ రక్షణ శాఖ చెబుతున్న ప్రకారం సీనియర్ సివిలియన్, మిలిటరీ నియామకాలను సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది.

45 ఏళ్ల ఎయిర్‌ఫోర్స్ కల్నల్ చారి బ్రిగేడియర్ జనరల్ పదవికి నామినేట్ అయ్యారు. చారి ప్రస్తుతం క్య్రూ-3 కమాండర్‌గా, వ్యోమగామిగా వ్యవహరిస్తున్నారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి చారి ఆస్ట్రోనాట్ మాస్టర్ డిగ్రీ చేశారు. అంతేకాకుండా మేరీలాండ్‌లోని యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, F-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్ డైరెక్టర్‌గా చారి పనిచేశారు.

కుటుంబ నేపథ్యం

రాజా చారి తాతముత్తాతలు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు. ఆయన తాతగారి హయాంలో వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో రాజా చారి తాత గణిత ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఓయూలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన రాజా చారి తండ్రి శ్రీనివాసాచారి 1970లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. తనకు పరిచయమైన పెగ్గీ ఎగ్బర్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. అమెరికాలోని మిల్‌వాకీలో (విస్కాన్సిన్)1977 జూన్‌ 24న రాజా చారి జన్మించారు.



Next Story