తొమ్మిది మంది కుటుంబంలో అందరిది ఒకే బర్త్ డే.. గిన్నిస్ రికార్డ్ సొంతం

by Dishafeatures2 |
తొమ్మిది మంది కుటుంబంలో అందరిది ఒకే బర్త్ డే.. గిన్నిస్ రికార్డ్ సొంతం
X

దిశ, వెబ్ డెస్క్: ఒక కుటుంబంలో ఇద్దరి బర్త్ డే ఒకే రోజున రావటం అరుదుగా జరుగుతుంది. సాధారణంగా కవల పిల్లల్లో మాత్రమే ఇలా జరుగుతుంటుంది. కానీ తొమ్మిది మంది ఉన్న ఓ కుటుంబంలో అందరి బర్త్ డే ఒకే రోజున వస్తే.. అది మామూలు వింత కాదు. ఈ వింతకే ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ సొంతమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోని లర్కానాకు చెందిన ఓ కుటుంబంలోని తొమ్మిది మంది బర్త్ డే ఒకే రోజున వస్తుంది. అమీర్ అలీ, ఖుదేజా అనే జంటకు మొత్తం ఏడుగురు సంతానం. తండ్రి అమీర్ అలీ, తల్లి ఖుదేజా ఆగస్టు 1న పుట్టారు. కాకపోతే పుట్టిన సంవత్సరాలు తేడా. ఇక వాళ్లకు 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న ఏడుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ల పెద్ద కూతరు సింధూ అదే రోజున పుట్టింది. ఇక తర్వాత ఆడ కవలలు ససూయ్, సప్నా కూడా ఆగస్టు ఒకటవ తేదీనే పుట్టారు.

అనంతరం వాళ్లకు అమీర్, ఆ తర్వాత అంబర్ అనే ఇద్దరు కుమారులు వేరు వేరు సంవత్సరాల్లో అదే తారీఖున పుట్టారు. ఇక అనంతరం పుట్టిన అమ్మర్, అహ్మర్ అనే మగ కవలల బర్త్ డే కూడా ఆగస్టు ఒకటవ తేదే. కాకపోతే వాళ్లు పుట్టిన సంవత్సరాలు మాత్రం వేరు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన తల్లీదండ్రులు, ఏడుగురు పిల్లల బర్త్ డే ఒకే రోజున రావడం నిజంగా చాలా అరుదైన విషయం. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట గిన్నిస్ దాకా వెళ్లడంతో ఈ అరుదైన ఫ్యామిలీకి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు లభించింది. కాగా ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తొమ్మిది మంది బర్త్ డేకు ఎంత పెద్ద కేకు కావాలో అని కొందరూ అంటుంటే.. లక్కీ ఫ్యామిలీ అంటూ మరికొందరు పొగడుతున్నారు.



Next Story

Most Viewed