చైనాలో విద్యుత్ సంక్షోభం.. వీధి లైట్ల వెలుతురు తగ్గించాలని ఆదేశం..

by Dishanational4 |
చైనాలో విద్యుత్ సంక్షోభం.. వీధి లైట్ల వెలుతురు తగ్గించాలని ఆదేశం..
X

బీజింగ్: చైనాలో విద్యుత్ సంక్షోభం పరాకాష్టకు చేరుకుంది. సిచువాన్ ప్రావిన్స్‌లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెల్సియస్‍‌కి పెరగడంతో ఏసీలకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. పైగా విద్యుత్ అవసరాలకు ప్రధానంగా డ్యామ్‌లపై ఆధారపడుతున్న సిచువాన్‌ రీజియన్‌లో రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీంతో విద్యుతం సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగా చైనాలో వీధిలైట్ల వెలుతురును తగ్గించాలని ప్రాదేశిక ప్రభుత్వం ఆదేశించింది. అవుట్‌డోర్ ప్రకటనలకు వాడే విద్యుత్ లైట్ల వెలుతురును తగ్గించాలని, సబ్ వే లైటింగును, బిల్డింగ్ సైన్‌ బోర్డులపై వెలుతురును తగ్గించాలని అధికారికంగా ప్రకటించారు.

కనీవినీ ఎరుగని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో విద్యుత్ వినియోగాన్ని ఏదోలా తగ్గించడం సిచువాన్ ప్రాంతీయ ప్రభుత్వానికి తలకు మించిన పని అవుతోంది. జపనీస్ కార్ దిగ్గజం టయోటోతో జాయింట్ వెంచర్లతో సహా ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని ఆదేశించారు. లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్న డజౌవు నగరంలో భారీ ఎత్తున విద్యుత్ కోత విధించారు. విపరీతమైన వేడి వాతావరణం కారణగా నగర విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

దీంతో ఉత్పత్తి, రోజువారీ జీవితావసరాలకోసం కూడా విద్యుత్ సరఫరా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో రెండు కోట్లమంది ప్రజలు నివసిస్తున్న చెంగ్డు రాజధాని నగరంలో లైట్ల వెలుగును డిమ్ చేయాలని అధికారులు ఆదేశించారు. మెట్రో ప్లాట్‌ఫామ్‌లు, మాల్స్‌లో వాక్‌వేస్ వంటి చోట్ల విద్యుత్ కాంతిని పాక్షికంగా తగ్గించేశారు. అతిపెద్ద యాంగ్జీ నది కూడా పూర్తిగా ఎండిపోవడంతో జల ప్రవాహ వేగం 50 శాతం పడిపోయింది. పారిశ్రామిక కేంద్రంగా ఉన్న సిచువాన్‌లో విద్యుత్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం వేయనుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.



Next Story