ఉద్యోగం మానేసిన ఉద్యోగి.. మూతబడ్డ టౌన్..

by Dishafeatures2 |
ఉద్యోగం మానేసిన ఉద్యోగి.. మూతబడ్డ టౌన్..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కంపెనీల్లో, వ్యాపారాల్లో ఉద్యోగులు చేరుతుంటారు మానేస్తుంటారు. ఒకరు వెళ్ళిపోతే మరొకరు అని సంస్థలు భావిస్తే, ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీ, వేరే ఉద్యోగం అని ఉద్యోగి ఆలోచిస్తాడు. అంతే తప్ప ఇద్దరికీ అంతగా నష్టం జరగదు. కానీ అమెరికాలో మాత్రం ఒక్క వ్యక్తి తన ఉద్యోగం మానేయడంతో పూర్తి టౌన్ (సొసైటీ) మూతబడింది. అన్నీ ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఈ తతంగం యూఎస్‌లోని పస్సడుంకీగ్ అనే టౌన్‌లో చోటు చేసుకుంది. ఈ టౌన్‌లో దాదాపు 350 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ టౌన్‌లోని అన్ని పనులను బుచర్డ్ అనే మహిళే చూసుకునేది. ఆమే రెండు సంవత్సరాలుగా ఆ టౌన్‌కు గుమస్తాగా పనిచేస్తోంది.

కానీ గతనెలలో ఆమె వెకేషన్‌కు వెళ్లేందుకు రెండు వారాల సెలవు కోరింది. కానీ టౌన్ మేనేజ్‌మెంట్ సంస్థ మాత్రం బుచర్డ్‌కు సెలవులు ఇచ్చేందుకు నిరాకరించింది. బుచర్డ్ లేని సమయంలో ఆమె పనులు చూసుకునేందుకు వేరే వ్యక్తి లేకపోవడమే అందుకు కారణం. కానీ తన సెలవులు విషయంలో యాజమాన్యం తీరుపై బుచర్డ్‌కు పట్టలేని కోపం వచ్చింది. అంతే 'ఐ క్విట్' అని ఓ నోట్ రాసి ఉద్యోగం మానేసింది. దాంతో ఆ టౌన్ అంతా మూతబడింది. ఎందుకంటే బుచర్డ్ లేకుంటే టౌన్‌లో వెహికల్ రిజిస్ట్రేషన్స్, హోం ఇన్స్‌పెక్షన్ ఇలా ఏమీ జరగవు. దాంతో దీనికి సంబంధించిన ఆఫీసు ఏప్రిల్ 21 నుంచి మూతబడే ఉంది. దీంతో ఆ సంస్థ తదుపరి ప్రకటన వచ్చే వరకు ఇక్కడ అన్ని సేవలు నిలిపివేయబడ్డాయి అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా తమకు ఓ గుమస్తా (క్లర్క్) కావాలంటూ ప్రకటించింది.


Next Story

Most Viewed