ఇజ్రాయెల్‌కు షాక్..ఆయుధాల సరఫరా నిలిపివేసిన అమెరికా!

by Dishanational2 |
ఇజ్రాయెల్‌కు షాక్..ఆయుధాల సరఫరా నిలిపివేసిన అమెరికా!
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ భారీ దాడికి సిద్ధమవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ రఫాపై దాడికి ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వెలువడటంతో ఆ దేశానికి ఆయుధాలు అందించే విషయాన్ని సమీక్షిస్తున్నట్టు వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొన్ని మిలియన్ల మంది నివసించే రఫా నగరంలో ఇజ్రాయెల్ అటాక్ చేయకుండా పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు యూఎస్ చురుకుగా పని చేస్తోందని వెల్లడించారు. నెతన్యాహుపైనా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గతవారం ఇజ్రాయెల్‌కు అందించాల్సిన 3500 బాంబులను అపివేసినట్టు పేర్కొన్నారు. ఎందుకంటే వీటిని రఫాలో వినియోగించొచ్చనే ఆందోళనతో సరఫరా చేయలేదని తెలిపారు.

కాగా, రఫా నగరంలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. అయితే హమాస్‌పై పట్టు సాధించేందుకు ఇక్కడ దాడి అనివార్యమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో రఫాపై జరిగితే అధిక ప్రాణనష్టం చవి చూడాల్సి వస్తుందని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అంతేగాక ఐక్యరాజ్యసమితి సైతం ఈ దాడులను ఆపేలా ప్రపంచదేశాలు చొరవ తీసుకోవాలని సూచించింది. ఈ విషయమై ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సైతం విన్నవించాయి. కానీ అందుకు ఆయన ససేమిరా అనడంతో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Next Story