అసెంబ్లీలో మాటల యుద్ధం

by  |
అసెంబ్లీలో మాటల యుద్ధం
X

దిశ, న్యూస్‌బ్యూరో: బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో గురువారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటలయుద్ధం జరిగింది. బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలతో మొదలైన ఈ మాటల యుద్ధం చివరకు రాజకీయ పార్టీల మధ్య వాదనకు దారితీసింది. కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఏకైక సభ్యుడు రాజాసింగ్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు మంత్రుల వరకు జోక్యం చేసుకున్నారు. ఈ రెండు జాతీయ పార్టీలూ దొందూ దొందే తీరుగా ఉన్నాయని, ఈ దేశానికి ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే వీరు లేవనెత్తిన అంశాల్లో వాస్తవం లేదని, కేవలం ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారని మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఒక దశలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలు ‘కిసీ కా బాప్ కా పైసా నహీ’ అనే కామెంట్ల దాకా చేరుకుంది. ఈ డైలాగునే అదికార, విపక్ష సభ్యులు పదేపదే ప్రస్తావించి విమర్శలు చేసుకున్నారు.

రాజాసింగ్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చివరకు టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైషమ్యం వైపు మళ్ళాయి. రాష్ట్ర బడ్జెట్‌పై చేసిన వ్యాఖ్యల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చివరకు కేంద్ర ప్రభుత్వానికి లింకు పెట్టారు. రాష్ట్రం నుంచి వేలాది కోట్ల రూపాయలను పన్నుల రూపంలో తీసుకుంటూ రాష్ట్రానికి చట్టబద్ధంగా వాటా ప్రకారం రావాల్సినవాటిని కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతోందని కేంద్రంపై విమర్శలు చేశారు. రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులను దయాదాక్షిణ్యాలతో ఇస్తున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. యుపీఏ ప్రభుత్వం సెంట్రల్ ట్యాక్స్ పేరుతో ఎగ్గొడితే ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఎగనామం పెడుతోందన్నారు.

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సైతం రాజాసింగ్‌కు సవాలు విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై విమర్శలు చేస్తున్న రాజాసింగ్ కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన పెండింగ్ నిధులను తీసుకురావాలని హితవు పలికారు. ఇప్పటికీ ఎస్‌జీఎస్టీ పద్దు కింద రూ. 933 కోట్లు, ఐజీఎస్‌టీ పద్దు కింద రూ. 2,812 కోట్లు, వెనకబడిన జిల్లాలకు పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సి ఉన్న రూ. 450 కోట్లను తీసుకురావాలని సూచించారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్ర ఆర్థిక శాఖ నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని, తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తోందన్నారు.

కాంగ్రెస్ బొక్కసంలోకి ప్రజాధనం

సంక్షేమానికి ప్రభుత్వం భారీస్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసి ఖర్చు చేస్తున్నా కాంగ్రెస్ తప్పుపట్టడాన్ని మంత్రి హరీశ్‌రావు తిప్పికొట్టారు. ప్రజల నుంచి డిమాండ్ లేకుండానే గురుకుల విద్యాసంస్థలు, కల్యాణలక్ష్మి, సన్నబియ్యం లాంటి అనేక పథకాలను అమలు చేస్తూ ఉందని గుర్తుచేశారు. కానీ, ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల మొబిలైజేషన్ ఫండ్ దిగమించిన కాంగ్రెస్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. నిజంగా ప్రజల సంక్షేమంపట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పదేళ్ళ అధికారంలో ఇలాంటి పథకాలను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. బడ్జెట్‌లో అంచనాలు పెంచారు తప్ప నిధుల సమీకరణపై స్పష్టత లేదని భట్టి విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కేటాయింపులు తగ్గాయని, అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టారని అన్నారు. కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలోనే నిర్మించిన లోయర్ మానేరు, మిడ్ మానేరు, ఇందిరమ్మ వరదకాలువ, ఎస్సార్ఎస్పీ లాంటి ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందన్నారు.

మొక్కజొన్న విక్రయాల విషయంలోనూ పౌల్ట్రీ రైతులకు అన్యాయం జరిగిందని, ఫెడరేషన్ పెద్దలకు భారీ ఎత్తున ముట్టాయని, కుంభకోణం జరిగిందని భట్టి విమర్శించారు. దీనికి మంత్రి ఈటల రాజేందర్ ఘాటుగా బదులిచ్చారు. బడ్జెట్‌పై చివరి రోజున జరిగిన చర్చల్లో విపక్ష సభ్యులకూ, మంత్రులకూ మధ్య గరంగరం వాదనలు జరిగాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అంశాల పరిధిని దాటి రాజకీయ పార్టీల ఘర్షణగా మారింది. ఈ వాదనలు మరింతగా ముదరడంతో చివరకు స్పీకర్‌కు, భట్టి విక్రమార్కకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. స్పీకర్‌తో వాదించే స్థాయికి సభాగౌరవం పడిపోవడం బాధగా ఉందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: Telangana, Assembly, Opposition, Congress, BJP, Mallu Bhatti, Raja Singh

Next Story