కూతురు కోసం అర్థరాత్రి బయటకు వెళ్లిన తల్లి.. ఏం జరిగిందంటే!

by  |
కూతురు కోసం అర్థరాత్రి బయటకు వెళ్లిన తల్లి.. ఏం జరిగిందంటే!
X

దిశ, ఏపీ బ్యూరో: అర్ధరాత్రి రెండేళ్ల కూతురు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఈ విషయాన్ని గమనించిన తల్లి భర్తకు చెప్పి మెడిసిన్ తీసుకురావాలని కోరింది. అయితే ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్దామని చెప్పి భర్త నిద్రపోయాడు. కూతురు ఇబ్బందిని చూసిన తల్లి తల్లడిల్లిపోయింది. పాపను కాపాడుకోవాలనే తాపత్రాయంతో అర్ధరాత్రి మెడికల్ షాపుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కూతురును కాపాడేందుకు వెళ్లి మృత్యువుకు బలైంది. ఈ హృదయ విదారకర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈనెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరానికి చెందిన యాస్మిన్‌(29), శ్రీనివాసనగర్‌కు చెందిన జగదీశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. చిన్నారికి జలుబు చేయడంతో గురువారం అర్ధరాత్రి సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. వెంటనే భర్తను లేపి పాపకు మెడిసిన్ తీసుకురావాలని కోరింది. ఉదయం హాస్పిటల్‌కు వెళ్దామని చెప్పి భర్త నిద్రపోయాడు. చిన్నారి ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఆ కన్న తల్లి తట్టుకోలేకపోయింది. పాప ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని ఆ కన్నపేగు తల్లడిల్లింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో మెడిసిన్ తీసుకొచ్చేందుకు తన స్కూటీపై మెడికల్ షాపుకు వెళ్లింది.

చంద్ర ఆసుపత్రి సర్కిల్ దాటగానే వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాస్మిన్‌ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన ఎస్ఐ జగదీశ్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం యాస్మిన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ శివకుమార్‌ యాక్సిడెంట్‌కు కారణమైన కారును వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు వెళ్లిన తల్లిని యాక్సిడెంట్ రూపంలో మృత్యువు వెంటాడటం అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది.

Next Story