ఏడేళ్ల సహజీవనం.. పండుగ రోజుతో సమాప్తం

92
Woman murder

దిశ, మఠంపల్లి : భర్త చనిపోయిన ఆమెకు ఓ తోడు దొరికాడని భావించింది. కాయాకష్టం చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అతడితో ఏళ్ల తరబడి సహజీవనం చేసింది. సర్వం అతడే అనుకున్న ఆమెను సంక్రాంతి పండుగ రోజే మట్టుబెట్టాడు ఆ దుర్మార్గుడు. ఇంటికి వచ్చి మరీ హత్య చేసి పరారీ అయ్యాడు నీచుడు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. వారి కథనం ప్రకారం..

మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంకు చెందిన షేక్ కైరూన్ (32), జానీ దంపతులు. 8 ఏళ్ల క్రితం జానీ మృతిచెందారు. భర్త మరణించిన తర్వాత జీవనోపాధి వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని పిడుగురాళ్లలో ఇటుక బట్టీల్లో పనికి వెళ్లింది కైరూన్. కూలి పని చేసే దగ్గర ఆమెకు కరిముల్లాతో పరిచయం ఏర్పాడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీయడంతో అతడితో కలిసి అక్కడే ఆరేళ్లపాటు సహజీవనం చేసింది.

కాగా ఏడాది క్రితం పిగుడురాళ్ల నుంచి ఆమె సొంత గ్రామమైన రఘునాథపాలెం వచ్చి ఉంటుంది. కరిముల్లా అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కైరూన్‌కు, కరీముల్లా మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన తర్వాత స్థానికులు కైరూన్ ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె నిర్జీవంగా పడి ఉంది. కైరూన్ గొంతి నులిమి, తాగుతో బిగించిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా, మృతిరాలికి ముగ్గురు కుమారులున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మఠంపల్లి ఎస్ఐ రవి తెలిపారు.