అతి పొడవైన ఐలాష్‌తో చైనా మహిళ గిన్నిస్ రికార్డ్

by  |
అతి పొడవైన ఐలాష్‌తో చైనా మహిళ గిన్నిస్ రికార్డ్
X

దిశ, ఫీచర్స్ : కలువల్లాంటి కళ్ళు ముఖానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. అయితే అందం మరింత ద్విగుణీకృతం కావాలన్నా, నయనాలు సౌందర్యంగా కనిపించాలన్నా కను‌రెప్పలు బాగుండాలి. అందుకోసం చాలామంది మహిళలు ఒత్తుగా, చిక్కగా కనిపించడం కోసం కనురెప్పలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. సాధారణంగా ఎవరి కనురెప్పలైనా అర ఇంచుకంటే తక్కువ సైజులోనే ఉంటాయి. కానీ చైనాకు చెందిన జియాన్‌జియా ఐ లాష్ 20.5 సెంటిమీటర్ల పొడువు పెంచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది.

ప్రపంచంలోనే అతి పెద్ద కనురెప్పలు కలిగిన వ్యక్తిగా యు జియాన్‌జియా ఇదివరకు ఆమె పేరిట ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను తాజాగా ఆమె బ్రేక్ చేసింది. జూన్ 28, 2016 నుంచి టైటిల్ ఆమె పేరిటే ఉండగా.. ఆ సమయంలో ఆమె ఎడమ కన్ను ఎగువ కనురెప్పపై ఉన్న వెంట్రుక పొడవు 12.4 సెం.మీ ఉంది. అయితే ఆమె కనురెప్ప వెంట్రుకలన్నీ పొడవుగానే ఉండటంతో అలాగే పెంచడం కొనసాగించింది. దాంతో ఒక ఐ లాష్ 20.5 సెం.మీ పెరగడం విశేషం. అయితే ఇలా అసాధరణంగా పెరుగుతున్న వెంట్రుకల కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య నిపుణులను ఆమెను పరిశీలించినా.. ఎలాంటి శాస్త్రీయ ఆధారాన్ని కనుగొనలేకపోయారు.

‘నా కనురెప్ప వెంట్రుకలు పెరుగుతున్నాయని 2015లో మొదట గ్రహించాను. అప్పటి నుంచి అవి మరింత పొడవు పెరుగుతూనే ఉన్నాయి. జన్యువులు లేదా మరేదైనా శాస్త్రీయ కారణాలున్నాయోనని తెలుసుకోడానికి నేను ప్రయత్నించాను. కానీ ఏమీ తెలియలేదు. మా కుటుంబంలో ఎవరికీ నా లాంటి పొడవాటి వెంట్రుకలు లేవు. అయినా వాటి గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. అయితే కొన్ని సంవత్సరాల క్రితం పర్వతంలో 480 రోజులు గడిపాను. కాబట్టి ఇవి నాకు బుద్ధుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను. వీటికి నా ఆరోగ్యానికి కూడా సంబంధముంటుంది. నేను పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాను. వీటితో అసౌకర్యం లేదు కానీ ఆనందం మాత్రం ఉంది. ఇవి నాకు ప్రత్యేకమైన అందాన్ని, గుర్తింపును అందించాయి’

– జియాన్‌జియా


Next Story