ఆ నిఘా లేకుంటే… లాక్ డౌన్ తో ఆశించిన ఫలితాలు అంతంతే

by  |
ఆ నిఘా లేకుంటే… లాక్ డౌన్ తో ఆశించిన ఫలితాలు అంతంతే
X

దిశ, వెబ్ డెస్క్: మనదేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30న కేరళలో నమోదయింది. చైనాలోని వుహాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి మన దేశ మొదటి కరోనా బాధితులు. ఇప్పటివరకు మనదేశంలోకి దిగుమతైన కరోనా కేసులే అధికంగా ఉంటూ వచ్చాయి. స్థానికంగా సోకిన కేసులు స్వల్పం. ఇక్కడ ఇంకా సామూహిక వ్యాప్తి దశ లేదని అధికారులు చెబుతున్నారు. తొలుత భారత పర్యటనలోని విదేశీయుల్లోనో… విదేశాల నుంచి వచ్చిన భారతీయ పౌరుల్లోనో కరోనా పాజిటివ్ గా తేలింది. తర్వాత వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు లేదా ఇతరులకు సోకింది. అంటే విదేశాల నుంచి భారత్ లోకి వచ్చిన వారందరిపై పటిష్ట నిఘా పెడితే కరోనాను కట్టడి చేయడంలో చాలా వరకు విజయం సాధించినట్టేనని అధికారులు సహా సామాన్యులూ అభిప్రాయపడ్డారు. అందుకే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారిపై, వారు తిరిగిన ప్రాంతాలు, కలుసుకున్న వ్యక్తులపై నిఘా వేయాలని రాష్ట్రాలకు పలుమార్లు సూచించింది.

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించడానికి ముందు భారత్ లో అడుగు పెట్టిన వారందరిపై గట్టి నిఘా పెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అనేకసార్లు రాష్ట్రాలను కోరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలనుంచి భారత్ లో అడుగు పెట్టిన వారందరి వివరాలు సేకరించినట్లు కనిపించడం లేదు. అందుకే తాజాగా సీనియర్ బ్యూరోక్రాట్.. సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కరోనా బాధితులు అత్యధికులు విదేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారని, కాబట్టి విదేశీ పర్యటన చేసి వచ్చిన వారందరిపై రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక నిఘా పెట్టాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. హోమ్ మినిస్ట్రీకి చెందిన బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్.. విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిని పర్యవేక్షించాలని సూచించగా… రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారి సంఖ్య దానితో సరిపోవడం లేదని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిని పర్యవేక్షించకుంటే కరోనా కట్టడి కోసం కేంద్రం తీసుకుంటున్న లాక్ డౌన్ సహా అనేక చర్యలు ఆశించిన ఫలితాలు సాధించబోవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే కరోనా సోకి లక్షణాలు బయట పడని వ్యక్తులు ఇంటికి చేరాక లాక్ డౌన్ కాలంలో అతని నుంచి వారి కుటుంబీకులకూ వైరస్ పాకవచ్చు.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలో చాలామంది క్వారంటైన్ నుంచి తప్పించుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేశారు. వైరస్ లక్షణాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. దీంతోపాటు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపించిన లిస్టు వివరాలు సరిగా లేవని రాష్ట్ర ప్రభుత్వాలూ ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు బీహార్ లోని ముజఫర్పూర్ శరన్ జిల్లాలను తీసుకుంటే.. కేంద్రం పంపించిన జాబితాలోని 500 మందిలో కేవలం 385 మందిని మాత్రమే రాష్ట్ర అధికారులు గుర్తించగలిగారు. ఎందుకంటే కొంతమంది ఆ లిస్టులో ఇంటర్నేషనల్ కాంటాక్ట్ నెంబర్లను నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో వారి వివరాలను కనుక్కోవడం కష్టసాధ్యంగా మారింది. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలనే పూర్తి స్థాయిలో కనుక్కోకపోవడంతో…. ఈ వైరస్ ఇప్పుడు వెల్లడవుతున్నదాని కంటే ఎక్కువ మందికే సోకి ఉండొచ్చన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి.

Tags : Coronavirus. Containment, international, travel history. Surveillance, immigration

Next Story

Most Viewed