వాయిదా.. ఎవరికి ఫాయిదా?

by  |
వాయిదా.. ఎవరికి ఫాయిదా?
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్నీ స్తంభించిపోయాయి. లాక్‌డౌన్ నిబంధనలతో ఆడటానికీ చూడటానికీ వీలులేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాసులు కురిపించే లీగ్స్ కూడా మూసేయాల్సి వచ్చింది. చాలా టోర్నీలు వాయిదా పడటం వల్ల ఆయా బోర్డులు ఆర్థికంగా నష్టాల పాలయ్యాయి. అయితే, బీసీసీఐకి బంగారు బాతులా ఉన్న ఐపీఎల్ మాత్రం నష్టాల పాలు కాలేదని ఇటీవల ఒక ఆర్థిక సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో తేలింది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ హక్కులను కొనుక్కున్న స్టార్స్పోర్ట్స్, టైటిల్ స్పాన్సరర్ వీవో ఇప్పటికీ బీసీసీఐతోనే ఉన్నాయి. ఈ ఏడాది జరగాల్సిన 13వ సీజన్ రద్దయినా వచ్చే ఏడాది ఈ రెండు కంపెనీలు బీసీసీఐకి సహకరిస్తామని చెప్పినట్టు సమాచారం. అయితే, ఐదేండ్ల కాంట్రాక్టును మరో ఏడాది పెంచమని బోర్డుపై ఒత్తిడి తెస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఐపీఎల్ వాయిదా వేసినా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు పెద్దగా నష్టం వచ్చే అవకాశాలు లేవు. ఆయా జట్లు ఇప్పటికే తమ మ్యాచ్‌లపై బీమా తీసుకున్నాయి. ఏకంగా ఐపీఎల్ ఆగిపోతే 8 మ్యాచ్‌ల బీమా ఆయా జట్లకు వస్తుంది. ఐపీఎల్ జరిగితే వచ్చే మొత్తం కంటే బీమా సొమ్ము చాలా తక్కువ. ఇండియాలో క్రీడలపై బీమా మొత్తాలు ఎక్కువగా ఇవ్వకపోవడమే దీనికి కారణమట.

ఐపీఎల్ కనుక వాయిదా పడితే ఎక్కువ లాభం బ్రాడ్‌కాస్టర్లకే అట. అదేంటి మ్యాచ్‌లు రద్దయితే వారికే నష్టం కావాలి కదా అని అందరూ అనుకుంటారు. కానీ, కాంట్రాక్ట్‌లో ఉన్న లొసుగు వల్ల స్టార్‌స్పోర్ట్స్ వంటి సంస్థలు లాభాల బాట పట్టనున్నాయి. ఐపీఎల్ అనుకోని కారణాల వల్ల రద్దయితే తమ కాంట్రాక్టును మరో ఏడాది ఎలాంటి రుసుములు లేకుండా బీసీసీఐ పొడిగించాలి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐపీఎల్ జరిగితే ఓకే. రద్దయితే మాత్రం బ్రాడ్‌కాస్టర్లకు మరో ఏడాది అదనపు కాంట్రాక్టు దక్కుతుంది. మరోవైపు ఎలాంటి రుసుములు చెల్లించకుండా మరో ఏడాదిపాటు పాత మ్యాచ్‌ల హైలైట్స్ ప్రసారం చేసుకోవచ్చు. అంతిమంగా ఈసారి ఆట ఆగితే బ్రాడ్‌కాస్టర్లకే లాభమని సదరు సంస్థ తెలియజేస్తోంది.

Next Story