కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు.. షాకిచ్చిన నేషనల్ మీడియా సర్వే

by  |
కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు.. షాకిచ్చిన నేషనల్ మీడియా సర్వే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‌‌‌‌సీఎం కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది.ప్రజాదరణలో అట్టడుగుకు చేరారు. 30.30% వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ప్రజాదరణ కోల్పోతున్న సీఎంగా నిలిచారు. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ భగేల్ ఉన్నారు. ఐఏఎన్ఎస్-సీఓటర్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించింది. 94 శాతం మంది ఆయన పాలన పట్ల తృప్తిని వ్యక్తపరిచారు. మొత్తం 115 అంశాల ఆధారంగా సర్వే సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీ ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్​ముఖ్ మంగళవారం సాయంత్రం వెల్లడించారు.

ఐదో స్థానం నుంచి అట్టడుగుకు..

ఏడాది వ్యవధిలోనే రాష్ట్రంలో కేసీఆర్​ గ్రాఫ్​ పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో వీడీపీ అసోసియేట్స్ సంస్థ ‘దేశ్ కా మూడ్’ పేరిట నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలవగా కేసీఆర్ ఐదో స్థానంలో ఉన్నారు. అప్పుడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ది నంబర్ వన్‌ పొజిషన్. ఏడాది కిందట వరకు దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన సీఎం కేసీఆర్.. ఈసారి ఘోరంగా వెనుకబడ్డారు. ఛత్తీస్​గఢ్​​ సీఎం భూపేశ్​ తొలి స్థానంలో, ఉత్తరాఖండ్​ సీఎం ప్రకాష్​సింగ్​ రెండోస్థానం, ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో చివరన సీఎం కేసీఆర్ నిలిచినట్టు సర్వే సంస్థ వెల్లడించింది. చివరి మూడు స్థానాల్లో 30.30%తో కేసీఆర్​, 28.10% యూపీ సీఎం, 27.70% వ్యతిరేకతతో గోవా సీఎం నిలిచారు.

పాపులారిటీ తగ్గి బీజేపీకి కలిసివస్తోంది..

సర్వే వివరాలను వెల్లడించిన సందర్భంగా సీ ఓటరు వ్యవస్థాపకుడు యశ్వంత్​ దేశ్​ముఖ్​ మాట్లాడుతూ.. సీఈవో తరహాలో పాలిస్తున్న ముఖ్యమంత్రులనే ప్రజలు ఇష్టపడుతున్నారని తేలిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాపులారిటీ బాగా పడిపోతున్నదని, కేసీఆర్ కు తగ్గుతున్న పాపులారిటీ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి దోహదపడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. 28.1 శాతం మంది ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై వ్యతిరేకతను వ్యక్తం చేశారని చెప్పారు.

సిట్టింగ్​ ఎమ్మెల్యేలపై..

రాష్ట్రంలోని సిట్టింగ్​ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో వ్యతిరేకత వెల్లడవుతున్నది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, గోవా, తెలంగాణ నిలిచాయి. తక్కువగా ఉన్న రాష్ట్రాల సరసన కేరళ, గుజరాత్​, మహారాష్ట్ర ఉన్నట్లు సర్వేలో తేల్చారు. ప్రస్తుతం హుజురాబాద్​ ఉప ఎన్నిక జరుగుతున్న ఈ సమయంలో ఈ సర్వే టీఆర్​ఎస్​ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నది. సీ ఓటరు సర్వే వివరాలను ఇప్పటికే సోషల్​ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గతంలో మూడ్​ ఆఫ్​ నేషన్​ సర్వేలో కూడా కేసీఆర్​ గ్రాఫ్​ తగ్గినట్లు వెల్లడించింది. తాజాగా ఇప్పుడు అత్యంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న సీఎంల జాబితాలో కేసీఆర్​ ముందు ఉండటం గమనార్హం.

ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత

రాష్ట్రం శాతం

ఏపీ 28.5

గోవా 24.3

తెలంగాణ 23.5

కేరళ 6.8

గుజరాత్​ 7.4

మహారాష్ట్ర 7.9

సీఎంలపై వ్యతిరేకత

రాష్ట్రం శాతం

తెలంగాణ 30.30

ఉత్తరప్రదేశ్​ 28.10

గోవా 27.70

చత్తీస్​గడ్​ 6.00

ఉత్తరాఖండ్​ 10.10

ఒడిశా 10.40


Next Story

Most Viewed