‘ఉత్తమ్’ పీఠానికి బీటలు

by  |
‘ఉత్తమ్’ పీఠానికి బీటలు
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ మారబోతున్నారా..? ఐదేండ్లు ఏకఛత్రాధిత్యం సాగించిన ఉత్తమ్ కు బ్రేకులు పడబోతున్నాయా..? కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జీ ఠాగూర్ తన మార్క్‌ను ప్రదర్శించబోతున్నారా..? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ వర్గాల నుంచి వస్తోంది. కుంతియా ఇన్ చార్జ్ గా ఉన్నన్నినాళ్లు ఆయన ఉత్తమ్ కుమార్ పై ఈగను కూడా వాలనియ్యలేదు. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు. దీంతో సీనియర్లు ఆయనపై గుర్రుగా ఉండడంతోపాటు పార్టీ అధిష్ఠానానికి పలుమార్లు ఫిర్యాదులు సైతం చేశారు. బహిరంగ లేఖలూ రాశారు. సిట్టింగ్ స్థానమైన సొంత నియోజకవర్గంలో తన భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడని విమర్శలు చేశారు. అయినా ఉత్తమ్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో ఉన్న సత్సంబంధాలతో ఆయన పదవిని కాపాడుకుంటూ వస్తున్నారు.

కాంగ్రెస్ గత ఎన్నికల్లో అన్ని పరాజయాలనే మూట కట్టుకున్నది. తాజాగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా ఉత్తమ్ చరిష్మా ఏమాత్రం ప్రభావం చూపలేదన్నది ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఇన్ చార్జ్ ఠాగూర్ ప్రత్యేక చొరవ తీసుకోని మండలానికో సీనియర్ నేతను, మాజీ మంత్రులను ఇన్ చార్జ్ లుగా నియమించినా.. రాష్ట్ర కెప్టెన్ గా ఉత్తమ్ తగిన ప్రచారం, అభ్యర్థి గెలుపునకు వ్యూహం రచించలేదని సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. గెలుపు సంగతి పక్కన పెడితే.. కనీసం రెండవస్థానంలో ఉంటామా లేదా అనేది కాంగ్రెస్ నేతల్లో సందేహంలో ఉన్నాయి. అయితే దుబ్బాకలో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుర్చీకి ఢోకా లేనట్టే. కానీ ఓడిపోతే మాత్రం ఈసారి ఖచ్చితంగా ఉత్తమ్ ను ఇంటికి సాగనంపాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. తాజాగా ఆ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ సైతం ఇదే తరహాలో కామెంట్ చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీలో మార్పులు ఉంటాయని, పార్టీని ప్రక్షాళన చేస్తారని, ఇప్పుడు పార్టీ ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్లు కూడా పీసీసీ చీఫ్ మార్పునకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, జానారెడ్డి తదితర సీనియర్ నేతలంతా తనకే పీసీసీ పదవి కావాలని అధిష్ఠానం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఉత్తమ్ ఉన్నంత కాలం తెలంగాణలో కాంగ్రెస్ గెలవదని, ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమని, వెంటనే పీసీసీ చీఫ్ ను మార్చాలని తెగేసి చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతూనే టీఆర్ఎస్ పార్టీతో అంటకాగుతున్నాడని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు వెళ్లిన కేటీఆర్ ను ఉత్తమ్ బహిరంగ వేదికపైనే పొగిడిన సందర్భాన్ని ఉఠంకిస్తున్నారు. కేసీఆర్ కుటుంబంతో ఉత్తమ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ప్రభుత్వంపై పోరాటానికి వెనకాడుతున్నాడని ఆరోపిస్తున్నారు.

ఉత్తమ్ పై ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఇన్ చార్జ్ ఠాగూర్ జిల్లాల వారీగా పీసీసీ చీఫ్ మార్పుపై పార్టీలో సర్వే చేస్తున్నట్లు తెలిసింది. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు సమాచారం. అయితే ఇప్పట్లో ఉత్తమ్ ను మార్చే ఆలోచనే లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మార్చలేదని, అలాంటప్పుడు దుబ్బాక ఫలితాలను బేస్ చేసుకొని ఎందుకు మార్చుతారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఉత్తమ్ ను మార్చినా టీపీసీసీ చీఫ్ కోసం పార్టీలోనే సీనియర్లు కొట్టుకునే పరిస్థితి వస్తుందని, దానికన్నా ఇప్పుడున్న పరిస్థితే నయమని ఉత్తమ్ వర్గీయులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా దుబ్బాక ఎన్నిక అన్ని పార్టీల్లోనూ మార్పులకు నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story