ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వ్యూహం ఇదేనా..?

by  |
RS Praveenkumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : అదనపు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వాలెంటరీ రిటైర్మెంట్) చేశారు. ప్రభుత్వ అనుమతి కోరుతూ సోమవారం లేఖ పంపారు. స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ట్విట్టర్ వేదికగా రెండు పేజీల లేఖను కూడా పోస్టు చేశారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితులను అందులో వివరించారు. ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు ఉన్నా హఠాత్తుగా వీఆర్ఎస్ తీసుకోవడంపై రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనున్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది.

నెల రోజుల క్రితం బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యి ఆ పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఇంతకాలం పదవి నుంచి తప్పుకోవడంపై నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడు స్పష్టత వచ్చినందున వీఆర్ఎస్ తీసుకోవాలని భావించినట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. మరోవైపు హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న టీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నిలబెట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు తోడు ఇంతకాలం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన ‘స్వేరో’ కార్యకర్తల నైతిక మద్దతుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టే అవకాశమూ ఉందన్న అంశం తెరపైకి వస్తున్నది.

ఏది జరిగినా ఇంతకాలం ఒక ఐపీఎస్ అధికారిగా వ్యవహరించిన ప్రవీణ్ కుమార్ ఇకపైన రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నారన్నది మాత్రం ఖాయమైంది. వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోడానికి ఉన్న పూర్వ నేపథ్యాన్ని, భవిష్యత్తు గురించి వివరించే లేఖలో ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. ఏ పార్టీలో చేరుతారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కానీ హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేదని, రాజకీయాల్లో ప్రవేశం గురించి ఇప్పుడే చెప్పలేనని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నానని, కొంత విరామం కావాలని, ఆ తర్వాతనే భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. కానీ పేదల పక్షం ఉండడానికే పదవీ విరమణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

వ్యక్తిగత కారణాల వల్లనే…

అదనపు డీజీపీ హోదాలో ప్రస్తుతం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ప్రభుత్వ సర్వీసులో 26 సంవత్సరాల పాటు పనిచేశానని, ఇంకా ఆరు సంవత్సరాల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. వీఆర్ఎస్ నిర్ణయం కొంత బాధ కల్గించినా ఎలాంటి పరిమితులు లేకుండా, ఇష్టమైన పనులను నచ్చిన రీతిలో చేయాలనుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. తన మూలాలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోనే ఉన్నాయని, అందుకే వాటికి సేవ చేయాలనే లక్ష్యంతోనే తొమ్మిదేండ్లు పని చేశానన్నారు. రాజీనామా తర్వాత మహాత్మ జ్యోతిరావుపూలే దంపతులు, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడుస్తానని, భావి తరాలను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని, పేదలకు, పీడితులకు అండగా ఉంటానని, తన నూతన ప్రయాణంలో అందరి దీవెనలు ఉండాలంటూ వ్యాఖ్యానించారు.

అసలు కారణాలు వేరే ఉన్నాయా?

ప్రవీణ్ కుమార్ రాజీనామా నిర్ణయం సంచలనంగా మారినా కారణాలేవై ఉంటాయా అనే చర్చ మొదలైంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల్లో జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోటా ఉండాలని, స్థానికులకు 50% సీట్ల కేటాయింపు ఉండాలని ముఖ్యమంత్రికి ఇటీవల విజ్ఞప్తులు వెల్లువ మొదలైంది. ప్రస్తుతం అలాంటి విధానం లేకపోవడంతో సొంత నియోజకవర్గంలోనే స్కూలు ఉన్నా అందులో చేరడానికి స్థానికులకు అవకాశం లభించడంలేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఆలోచించిన సీఎం కేసీఆర్ అన్ని గురుకుల విద్యా సంస్థల్లో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని స్థానికులకు 50% సీట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

కానీ ఆ విభాగం కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వ డెసిషన్‌ను తప్పుపట్టారని, ఆ కారణంగానే ఇప్పుడు పక్కకు తొలుగుతూ వీఆర్ఎస్ కోసం అప్లై చేసినట్లు చర్చలు జరుగుతున్నాయి. గురుకుల విద్యా సంస్థల హాస్టళ్ల నిత్యావసరాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల బిల్లులు చెల్లింపునకు నోచుకోకుండా పెండింగ్లో ఉన్నాయని, అది కూడా ఒక కారణమై ఉంటుందనే చర్చ కూడా ఉన్నది. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారంతో సతమతమవుతున్నారని, ఇలాంటి పరిమితుల మధ్య పనిచేయడం కంటే స్వేచ్ఛగా తాను అనుకున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టడం కోసమే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు పేర్కొన్నారు.

బీఎస్పీలో చేరుతారా..?

బహుజన సమాజ్ పార్టీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తిగా ఉన్నట్లు టాక్. గత నెలలో ఆయన యూపీకి వెళ్లి బీఎస్సీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అప్పటికే జై భీమ్… జై భారత్ నినాదంతో ఉన్న ఆయన పలు సందర్భాల్లో బహుజనవాదం కూడా వినిపించారు. ప్రస్తుతం ఆయన బీఎస్పీలో చేరుతారనే ప్రచారం మొదలైంది. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో చేరేందుకే ఐపీఎస్‌కు రాజీనామా చేశారంటున్నారు.

కొత్త పార్టీ పెడతారా..?

‘స్వేరో’ పేరుతో దాదాపు 32 లక్షల మంది వాలంటీర్లను (స్వేరో స్టార్స్) తయారు చేసిన ప్రవీణ్ కుమార్ త్వరలో సొంత పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు వారు చెప్పుకుంటున్నారు. రాజకీయాలపై కొంత ఇష్టాన్ని కూడా వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో స్వేరో సమావేశాలను గ్రాండ్గానే నిర్వహించారు. స్వేరో స్టార్స్ అండగా ఉంటామంటూ తీర్మానాలు కూడా చేశారు. ఆయన తన ప్రసంగాల్లో స్వేరోయిజాన్ని ప్రస్తావించేవారు. చాలా మంది దళిత విద్యార్థులకు ఉన్నత చదువుల అవకాశాన్ని కల్పించారు.

టీఆర్ఎస్‌కు అనుబంధంగా…!

ఇప్పటివరకు ప్రభుత్వానికి విధేయతను చూపించిన ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్‌లో చేరుతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నా, ఆయనపై పలు ఆరోపణలు వచ్చినా సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా కొనసాగించారు. మరే అధికారికి లేనంతగా కేసీఆర్ నుంచి ఆయనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని తోటి ఉన్నతాధికారులే ప్రస్తావిస్తూ ఉంటారు. దీంతో ఆయన టీఆర్ఎస్ లో చేరవచ్చనే చర్చకు బలం చేకూరినట్లయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన్ను అభ్యర్థిగా ఖరారు చేయవచ్చనే ప్రచారం కూడా ఉంది. హుజురాబాద్ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పిన ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్లో చేరే విషయాన్ని మాత్రం సూటిగా చెప్పలేదు.

దళిత బంధు బాధ్యతలు ?

హుజూరాబాద్ నుంచి పోటీ చేసినా చేయకపోయినా టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత దళిత బంధు పథకాన్ని అమలుచేసే బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సూచన మేరకే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దళిత సాధికారతపై దృష్టి పెట్టినందున రైతుబంధు తరహాలోనే దీన్ని కూడా పకడ్బందీగా అమలు చేయడంపై ఆలోచిస్తున్న కేసీఆర్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదలు 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ వర్గం ఓట్లు పదిలంగా ఉంచుకోడానికి దూరదృష్టితోనే ఈ వ్యవహారం నడిచినట్లు చర్చలు జరుగుతున్నాయి.

రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చెప్పలేను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

“వంద శాతం పేదల పక్షాన ఉండాలనుకుంటున్నాను. అందుకే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాను. అనేక శాఖల్లో పని చేశాను. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉంది. నా సర్వీసులో కేవలం ఒక్క శాతం మాత్రమే పేదలకు సేవలందించాను. వందశాతం పేదల పక్షాల ఉండాలనే రాజీనామా చేస్తున్నాను. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. స్వేరోస్ విద్యార్థులెవరూ అధైర్యపడొద్దు. నా కంటే మంచి అధికారులు వస్తారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’.

Follow our Facebook official page : https://www.facebook.com/dishatelugunews

Next Story

Most Viewed