న్యాయవాదితో కలిసి భార్య పాడుపని.. సహకరించిన యూట్యూబర్!

355
Wife murder sketch

దిశ, కోదాడ : ఆస్తి కోసం భార్య చేసిన పనికి ఓ యూట్యూబర్, న్యాయవాది తోడయ్యారు. వారితో కొంతమందిని కలుపుకుని భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేసిందీ కన్నింగ్ భార్య. చట్టాన్ని కాపాడాల్సిన లాయరే సుఫారీ తీసుకుని మరీ హత్యకు స్కెచ్ వేయడం సంచలనంగా మారింది. లాయర్ తెలివి తేటలతో చేసిన పధకం బెడిసికొట్టడంతో కథ అడ్డం తిరిగి కటకటాల పాలయింది తొమ్మిది మంది ఉన్న ఈ కంత్రీ ముఠా. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను బుధవారం కోదాడ రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు.

మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన మేకల సత్యనారాయణ, కనకదుర్గ భార్యభర్తలు. వీరిద్దరి మధ్య ఇటీవల ఆస్తి గొడవలు నడుస్తున్నాయి. సత్యనారాయణ తాగి ఆస్తిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని, తనను కాదని మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని భావించింది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోని ఆస్తిని మొత్తం కాజేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కోదాడ లో ఓ యూట్యూబ్ చానల్ విలేకరిగా పనిచేస్తున్న గంధం వెంకటనారాయణను సంప్రదించి, తన ప్లాన్‌ను వివరించింది. దీనికి ఒప్పుకున్న వెంకట నారాయణ తనకు తెలిసిన న్యాయవాది పాలేటి నాగేశ్వరరావు ఉన్నాడని, అతడి సహకారం తీసుకుందామని ఇద్దరు వెళ్లి కలిశారు. వారికి బుద్ది చెప్పాల్సిన లాయర్ కూడా వారితో చేతులు కలిపాడు. తనతోపాటు తన డ్రైవర్ వీరబాబు ఇటువంటి పనులు చేస్తామని వారి వద్ద నుంచి రూ.50 వేల సుఫారి మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత డ్రైవర్ వీరబాబు తనకు తెలిసిన త్రివేణి బాబుతో పాటు హుజూర్ నగర్‌కు చెందిన గోపి, హనీ, అనంతగిరికి చెందిన జానీ, వెల్లటూరుకు చెందిన శ్రీనులకు హత్య గురించి వివరించాడు. సత్యనారాయణ ఫొటో చూపించి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు. గత నెల డిసెంబర్ 7న సత్యనారాయణ రామాపురం రావడం గమనించారు. అతను తిరిగి రామాపురం నుండి కోదాడకు వస్తున్నాడని తెలుసుకొని సాయంత్రం ఐదు గంటల సమయంలో కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు కారును అడ్డగించారు.

వెంటనే సత్యనారాయణపై ఇనుపరాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. అదే కారులో ఉన్న ఓ మహిళ గట్టిగా అరిచింది. అదే సమయంలో సత్యనారాయణ స్పృహ కోల్పోవడంతో అతడు చనిపోయాడని అక్కడి నుంచి పరారయ్యారు. సుఫారి గ్యాంగ్ ఈ విషయాన్ని న్యాయవాదికి తెలపగా ఈ కేసు గురించి నేను చూసుకుంటానని వారికి భరోసా ఇచ్చాడు. ఈ విషయమై బాధితుడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు వారిని బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.

Read more:  బరువు తగ్గాలనుకుంటున్నారా.. మార్నింగ్ ఈ పని చేయండి