కాపురానికి తీసుకెళ్లాలంటూ.. భర్త ఇంటి ఎదుట ధర్నా

by  |
కాపురానికి తీసుకెళ్లాలంటూ.. భర్త ఇంటి ఎదుట ధర్నా
X

దిశ, ఎల్బీనగర్: కట్టుకున్న భార్యను, కన్న కుమారుడిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి చెప్పుడు మాటలు విని భార్య కుమారుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. తనకు, తన కుమారుడికి న్యాయం జరిగే వరకూ ఇక్కడే కూర్చుంటాను.. అంటూ ఓ బాధితురాలు భర్త ఇంటి ఎదుట గురువారం కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ సంఘటన సరూర్​నగర్​ పోలీస్ ​స్టేషన్ ​పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం… సరూర్‌నగర్, శ్రీసాయికృష్ణ‌నగర్‌కు చెందిన రిటైర్డ్ విద్యుత్ ఏఈ బూరం దశరథ కుమారుడు బూరం సంతోష్ కుమార్‌కు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గజ్జెల శేఖర్ కుమార్తె మౌనికతో 2017లో వివాహం జరిగింది. మౌనిక భర్త గోవాలోని ఓ రెస్టారెంట్‌లో మేనేజర్గా ఉద్యోగం చేశాడు. ఏడాదిపాటు కాపురం సజావుగా సాగుతుండగా మౌనిక గర్భవతిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఉద్యోగం మానేసిన భర్త హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుందామని భార్యను పంపించాడు. ఉద్యోగం మానేయడం ఎందుకు అని ప్రశ్నించిన భార్య మతిస్థిమితం సరిగా లేదని సంతోష్ , అతని తల్లిదండ్రులు, తమ్ముడు ప్రోద్బలంతో ఆరోపణలు చేసి మౌనిక ను తల్లిదండ్రుల వద్దకు పంపించారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు సర్దిచెప్పి వేరే చోట కాపురం పెట్టించారు. వీరికి ఓ బాబు పుట్టిన తర్వాత కూడా సరిగా పట్టించుకోలేదు. భార్యను, కుమారుడిని అత్తమామల వద్ద వదిలేసి విడాకులు కావాలని నోటీసులు పంపించాడు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మూడు దఫాలుగా నాగర్ కర్నూలు పోలీసులు, భార్యభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ తన భర్త కాపురానికి తీసుకువెళ్లడం లేదని భర్త ఇంటి ముందు కుటుంబసభ్యులతో కలిసి ధర్నాకు దిగింది. భర్త సంతోష్ మా ఇంట్లో లేడని , నువ్ మా ఇంటికి ఎందుకు వచ్చావ్ .. అంటూ మౌనిక‌ను, ఆమె కుటుంబ సభ్యులను దౌర్జన్యంగా అత్తింటివారు బయటకు గెంటేసి తలుపులు పెట్టుకోవడంతో మౌనిక భర్త ఇంటి ముందు కూర్చుని తనకు న్యాయం చేయాలని మౌన దీక్ష కొనసాగిస్తోంది.

Next Story

Most Viewed