ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య !

by  |
murde
X

దిశ, చేవెళ్ల: అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తాడనే నెపంతో ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసి అచ్చంపేట అడవుల్లో పడవేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతుని తండ్రి ఫిర్యాదుతో షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా అసలు దొంగలు దొరికారు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్ మండలం కేశవ గూడ గ్రామానికి చెందిన మాణిక్యరావు (30)కు 15 సంవత్సరాల క్రితం షాబాద్ గ్రామానికి చెందిన తొంట శోభతో వివాహం జరిగింది.

భార్యాభర్తలిద్దరూ షాబాద్ లో ఇల్లు అద్దెకు తీసుకొని కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన సంసారంలో భార్య అక్రమ సంబంధం చిచ్చు రేపింది. షాబాద్ గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తితో శోభకు అక్రమ సంబంధం ఉందనే విషయం భర్తకు తెలియడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. భర్తను అడ్డు తొలగించుకుంటే అక్రమ సంబంధం సాఫీగా సాగుతుందనే నెపంతో శోభ ప్రియుడు యాదగిరితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది. ఈ నెల 13వ తేదీన తనకు ఆరోగ్యం బాగా లేదంటూ చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి షాద్‌నగర్‌లోని ఆస్పత్రికి వెళ్లారు.

ఆసుపత్రిలో చికిత్స అనంతరం శోభ ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో శోభా యాదగిరి, భర్త మాణిక్యం ముగ్గురు కలిసి కల్లు తాగేందుకని మామిడిపల్లి కుమ్మరి గూడ గ్రామాల మధ్య చెట్లలోకి వెళ్లారు. అయితే ముందే వేసుకున్న పథకం ప్రకారం చున్నీతో భర్త మాణిక్యరావు గొంతుకు బిగించి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరుసటి రోజు కారు అద్దెకు తీసుకుని మరో ఇద్దరి సహకారంతో మాణిక్యరావు శవాన్ని కారులో వేసుకొని అచ్చంపేట అడవుల్లో పడేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు తెలిసింది.

తన కుమారుడు కనిపించకపోవటంతో తండ్రి అనంతయ్య ఈనెల 24వ తేదీన షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న షాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ దర్యాప్తులో భాగంగా శోభను అదుపులోకి తీసుకొని తమదైన శైలితో విచారణ చేయగా నిందితురాలు నిజం ఒప్పుకుంది. ఈ కేసులో సెల్‌ఫోన్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. దాని సహయంతో కేసును సులభంగా చేధించగలిగామని అన్నారు

Next Story