ఫాలో లాజిక్స్.. శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు సాగాలి

by  |
ఫాలో లాజిక్స్.. శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు సాగాలి
X

దిశ, వెబ్‌డెస్క్: శ్వేత చదువులో గోల్డ్ మెడల్ పొందిన విద్యార్థి. ఆమె భర్త వేద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అయితే శ్వేత 9 నెలల నిండు గర్భిణి.. ఆమె డెలివరీ డేట్ దగ్గరపడుతుండటంతో, శుక్రవారం మంచిరోజు ఉందని మా సిద్ధాంతి చెప్పాడు. ఆ రోజు ఆపరేషన్ చేయండని డాక్టర్‌కు ఆ దంపతులు వివరించారు. చేసేదేం లేక డాక్టర్ కూడా ఓకే అన్నాడు. ఇది వేద్, శ్వేత‌కే పరిమితమైన కథ కాదు. ఎందరో ప్రతిభావంతులు, మేధావులు, చదువుకున్నవాళ్లు ఆ దేవుడు నిర్ణయించిన కాలాన్ని తప్పుపడుతూ శుభ ముహుర్తాల్లో పిల్లల్ని కంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు.. తరచి చూస్తే.. మూఢనమ్మకాలు, విశ్వాసాలు లేని వారు మనలో కొందరైనా ఉన్నారా? అనే అనుమానం కలగకమానదు. ఇవి చాలా చిన్న అంశాలుగా మనకు అనిపించొచ్చు. కానీ, ఈ నమ్మకాలే తీవ్రమైన పరిస్థితులకు దారీతీయొచ్చు. అందుకు మన కళ్లముందు రోజూ జరుగుతున్న భయంకరమైన ఘటనలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

మంచి రోజు, ముహుర్తం రెండు కుదిరితేనే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాం. కొత్త ఉద్యోగ బాధ్యతలు స్వీకారించాలన్నా, స్కూల్లో జాయిన్ చేయాలన్నా, కారు కొనాలన్నా చివరకు ఇంట్లో పాత వస్తువులను అమ్మేయాలన్నా శుభదినాల్లోనే ఆ పనులు చేస్తాం. కానీ, సమయాన్ని, రోజును శుభప్రదం చేసేది ఏదీ? ఏ శాస్త్రీయ పరిశీలన ఆధారంగా ఈ ఆలోచనలు, అలవాట్లకు మనం లోబడి ఉంటున్నాం. అదే మన సమస్య, బలహీనత. వాస్తవికతకు ఆధారం లేని విషయాలనే తరుచుగా నమ్ముతూ మూఢ నమ్మకాలవైపు ప్రయాణిస్తున్నాం. బ్రహ్మాండైన ముహుర్తంలో ప్రారంభించినా.. ఫెయిలైన బిజినెస్‌లు బోలెడు. అలానే అమావాస్య రోజు ఉద్యోగంలో, స్కూల్లో చేరిన వాళ్లు ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్లు లేకపోలేదు. అందరూ మంచి ఘడియాలనే నమ్ముకుంటున్నప్పుడు అందరికీ విజయాలే దక్కాలి కదా. అలా జరగడం లేదే? తినడానికి, పడుకోవడానికి, శ్వాసించడానికి ఆచరించని శుభ ముహుర్తాలను, వేటికి ఆచరించొద్దు. కష్టపడితేనే ఎక్కడైనా సక్సెస్ వస్తుంది. అంతేకానీ ముహుర్తాల వల్ల కాదని గుర్తెరగాలి.

పాశ్చాత్య దేశాల్లో శుక్రవారం రోజు వచ్చే 13వ తేదీని దురదృష్ట రోజుగా పరిగణిస్తారు. హోటల్స్‌తో పాటు పెద్ద పెద్ద భవనాల్లో 13వ ఫ్లోర్ ఉండదు. ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థలైన ఎయిర్ ఫ్రాన్స్‌లో 13వ వరుస కనిపించదు. లూఫ్తాన్సాలో 13, 17 వరుసలు ఉండవు. ఇటలీ, బ్రెజిల్ దేశాల్లో 17, 13 నెంబర్స్ అన్‌లక్కీ నెంబర్స్‌గా భావిస్తారు. జపనీయులు తమ లక్కీ డే నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. మనదేశంలోనూ న్యూమారాలజీని నమ్మే వారి సంఖ్య గణనీయంగానే ఉండగా, చాలా మంది సెలెబ్రిటీలు తమ పేరులోని అక్షరాలను మార్చుకున్నారు. అంకెలు, సంఖ్యలు, అక్షరాలు జీవితాలను అసలు ఏమాత్రం మార్చలేవు. ఒకవేళ అలానే జరిగితే, ఆ సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముకున్న వాళ్లంతా కోటీశ్వరులు కావచ్చు కదా. మన దగ్గర ఫీజు తీసుకోవడం ఎందుకు? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయిస్తే, మరోసారి అంకెల గారడీ జోలికి వెళ్లరు. నలుపు దుస్తులు కట్టుకోవడం అశుభమని, ఆ వారం (సోమ-ఆది) ఆ రంగు డ్రెస్ ధరిస్తే అదృష్టమని, రంగురాళ్లు పెట్టుకోవడం, పులిగోర్లు మెడలో ధరించడం వల్ల లాభమని, తాబేలు ప్రతిమ, లాఫింగ్ బుద్ధ, మనీ ట్రీ ఉంటే కలిసి వస్తుందని నమ్మేవాళ్లు బోలెడుమంది ఉన్నారు. రంగులను బట్టి మూడ్ మారుతుంది తప్ప, విధి రాత మారదు. జీవితంలో పదివేలు సంపాదించే వాడు తెల్ల దుస్తులు ధరించగానే కోటిశ్వరుడు కాడు, నల్ల దుస్తులు వేసుకోగానే బికారీ కాలేడు. రంగుల్లో కాదు, శక్తియుక్తుల్లో, మేధాశక్తితోనే మన జీవితం మారుతుంది. చేతులు కోల్పోయినా వాళ్లు రేఖల మీద ఆధారపడరు. రేపటిని డిసైడ్ చేసే కష్టాన్ని, శ్రమను, సంకల్పాన్ని మాత్రమే నమ్ముకుంటారు.

ఇకనైనా ఆధారంలేని నమ్మకాలకు మెదడులో చోటివ్వకుండా శాస్త్రీయంగా ఆలోచన చేయడం మొదలుపెట్టండి. మన మెదడు ఎంతో శక్తిమంతమైంది. కానీ, సైన్స్ రహస్యాలను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఓ రచయిత అన్నట్లు.. లాజిక్స్ ఎవరూ నమ్మరు, మ్యాజిక్స్ మాత్రమే నమ్ముతారు. అందువల్లే శాస్త్రవేత్తల కన్నా బాబాలే బాగా ఫేమస్ అవుతున్నారు. వ్యక్తిగత నమ్మకాలు, అనుభవాలే మనల్ని మూఢ నమ్మకాలు, విశ్వాసాల దిశగా నడిపిస్తుండగా, అవి అహేతుకమైనవి, అశాస్త్రీయమైనవని తెలిసినా ఆ ఉచ్చులోనే పడిపోతున్నాం. ఈసారి నల్లపిల్లి ఎదురుపడినా, ఎవరైనా తుమ్మినా.. ధైర్యంగా ఎడమకాలు పెడుతూ, నల్ల దుస్తుల్లో పని ప్రారంభించండి. దేర్ ఈజ్ నో బ్యాడ్ టైమ్ టు డూ ద గుడ్ థింగ్ అని గుర్తుంచుకోండి. అమవాస్య-పౌర్ణమి, మంచి రోజు- చెడు రోజు అనేవి ఎక్కడా లేవు.. మన మెదడులో తప్ప అని గ్రహించండి.

Next Story