నందిగ్రామ్ సంగ్రామంలో నిలిచేదెవరు..?

by  |
నందిగ్రామ్ సంగ్రామంలో నిలిచేదెవరు..?
X

కోల్‌కతా, గువహతి : గడిచిన రెండు నెలలుగా దేశ ప్రజానీకం దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్‌ ఓటింగ్ సంగ్రామానికి సిద్ధమైంది. దేశాధినేత, రాష్ట్రాధినేతతో సహా బీజేపీ, టీఎంసీలకు చెందిన అగ్ర నాయకత్వం అంతా ఇక్కడే మకాం వేసిందంటేనే ఈ స్థానానికున్న ప్రాధాన్యతను అంచనా వేయవచ్చు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నా లేని ఉత్కంఠ, కలగని ఆసక్తి నందిగ్రామ్‌లో నెలకొన్నది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక్కడ పోటీకి దిగడం, ముప్పై ఏళ్ల పాటు ఆమె అనుయాయుడిగా మెలిగి కొద్దికాలం క్రితమే బీజేపీలో చేరిన సువేంధు అధికారి దీదీని ఢీకొంటుండటంతో అందరి కళ్లూ నందిగ్రామ్ వైపునకు మళ్లాయి. ఒకవైపు దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నిక కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఓ ఎత్తు, నందిగ్రామ్ ఎన్నిక ఓ ఎత్తు అన్నంతగా బీజేపీ పోటీకి దిగింది. ఇరు పార్టీలు ప్రచారం కూడా హై ఓల్టేజీని తలపించింది. నందిగ్రామ్‌ను గెలిస్తే బెంగాల్‌ తమదే అని బీజేపీ భావిస్తుండగా.. ఆ అవకాశాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని పోరాడారు మమతా బెనర్జీ. కాలుకి దెబ్బ తగిలినా.. బీజేపీ అగ్ర నాయకత్వం అంతా దీదీనే లక్ష్యంగా విమర్శలు చేసినా ఆమె వెరవకుండా వీల్ చైర్‌లో కూర్చొని మరీ పోటాపోటీ ప్రచారం నిర్వహించాందామె. రెండు నెలల పాటు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం రణస్థలిగా మారిన నందిగ్రామ్ నేడు ఆఖరి అంకానికి సిద్ధమైంది.

నందిగ్రామ్‌లో 144 సెక్షన్..

ఇరు పార్టీలు అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్న నందిగ్రామ్‌ను ఎన్నికల కమిషన్ అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించింది. ఇక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో శుక్రవారం రాత్రి వరకు అక్కడ నిషేదాజ్ఞలు విధించింది. ఆజ్ఞలు ముగిసేదాక నందిగ్రామ్ ఓటరు కాని వ్యక్తిని నియోజకవర్గంలోకి అనుమతించేది లేదని తెలిపింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని ఆదేశించింది. హెలికాప్టర్లతో నిఘా వేసిన ఈ ప్రాంతంలో 22 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.

కేంద్ర బలగాల నీడలో బెంగాల్..

బెంగాల్‌లో 30 నియోజవకర్గాల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాలను ‘సెన్సిటివ్’గా ప్రకటించిన ఈసీ.. 651 కంపెనీల బలగాలతో భద్రతా చర్యలు చేపట్టింది. 171 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న బెంగాల్ రెండో దశ పోలింగ్‌లో 75,94,549 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ఇక అసోంలో 39 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. తొలివిడతలో భాగంగా బెంగాల్‌లో 84.63 శాతం, అసోంలో 79.97 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed