ఎస్ఆర్‌హెచ్‌లో ఆ నలుగురు ఎవరు..?

by  |
IPL
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022లో ఏ జట్టులో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొన్నది. విదేశీ ప్లేయర్లపై ఎక్కువగా ఆధారపడిన జట్లకు కొత్తగా బీసీసీఐ తీసుకొచ్చిన నిబంధన ఆశనిపాతంగా మారింది. యూఏఈలో సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న మలి దశ ఐపీఎల్ తర్వాత ప్రతీ జట్టు నలుగురిని తప్ప మిగిలిన క్రికెటర్లను విడుదల చేయాల్సి ఉంది. కేవలం నలుగురు క్రికెటర్లు.. అందులో ఇద్దరు ఇండియన్స్, ఇద్దరు ఫారనర్స్ మాత్రమే ఉండాలనే నిబంధన పెట్టింది. కొత్తగా రాబోతున్న జట్లలో స్టార్ ప్లేయర్లు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలలో ఉన్న స్టార్ ప్లేయర్లను వదులుకోవాల్సి రావడం.. వేలంలో వారిని తిరిగి దక్కించుకుంటామో లేదో అనే అనుమానాలు ఫ్రాంచైజీ యాజమాన్యాలకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.

హైదరాబాద్ ఏం చేయబోతున్నది?

ఐపీఎల్‌ మెగా ఆక్షన్ ముందు బీసీసీఐ విధించిన ప్లేయర్స్ రిటెన్షన్ నిబంధనల వల్ల భారీగా నష్టపోనున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ జట్టు మొదటి నుంచి ఎక్కువగా విదేశీ ప్లేయర్లపైనే ఆధార పడింది. 2012లో ఐపీఎల్‌లోకి ప్రవేశించిన ఈ జట్టు 2016లో విజేతగా నిలిచింది. గత ఐదు సీజన్లుగా ఎస్ఆర్‌హెచ్ జట్టు క్రమం తప్పకుండా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తూ వస్తున్నది. హైదరాబాద్ జట్టు విజయాల్లో విదేశీ ప్లేయర్లదే కీలక పాత్ర. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్ వంటి క్రికెట్లు మ్యాచ్ విన్నర్లుగా ఉంటూ వస్తున్నారు. వీరితో పాటు కేన్ విలియమ్‌సన్, జేసన్ హోల్డర్ కూడా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి ఆరింట ఓడిపోయింది.

వరుస పరాజయాలతో డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టింది. అతడి స్థానంలో కేన్ విలియమ్‌సన్‌కు బాధ్యతలు అప్పగించింది. అయినా హైదరాబాద్ అదృష్టం మారలేదు. 2016 నుంచి ఈ జట్టు కొత్తగా ముగ్గురిని తప్ప ఎవరినీ జట్టులోకి తీసుకోలేదు. అప్పటి నుంచి అదే జట్టును రిటైన్ చేసుకుంటూ వస్తున్నది. ఈ జట్టులో ఓపెనర్లతో పాటు రషీద్ ఖాన్ కీలకమైన ఆటగాళ్లు. అయితే వీరంతా విదేశీయులే కావడంతో అసలు ఎవరిని రిటైన్ చేసి ఎవరిని వదులుకోవాలో తెలియని పరిస్థితి. కాగా, జట్టు ప్రస్తుత పరిస్థితి.. భవిష్యత్ అంచనాల మేరకు నలుగురిని రిటైన్ చేసుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ నలుగురు వీళ్లేనా?

హైదరాబాద్ జట్టును డేవిడ్ వార్నర్ వీడేది దాదాపు కన్ఫార్మ్ అయినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విదేశీ ప్లేయర్లలో కేవలం ఇద్దరినే అట్టిపెట్టుకొనే అవకాశం ఉండటంతో ప్రస్తుత కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను జట్టుతో కొనసాగించాలని భావిస్తున్నారు. విలియమ్‌సన్ కెప్టెన్సీ, కీలక సమయాల్లో బ్యాటింగ్ జట్టుకు చాలా అవసరం. కాబట్టి విలియమ్ సన్ జట్టులో కొనసాగడం ఖాయం గానే కనిపిస్తున్నది. ఇక మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేసే ప్రశ్నే లేదని ఇటీవల మీడియా ముందు హెడ్ కోచ్ ట్రెవోర్ వ్యాఖ్యానించారు. జట్టు యాజమాన్యం కూడా రషీద్ ఖాన్ పట్ల సానుకూలంగానే ఉన్నది. వీరిద్దరితో విదేశీ కోటా పూర్తవుతుంది.

ఇక భారత ప్లేయర్లలో కేవలం బౌలర్లను రిటెన్షన్ చేసుకోవడానికే ఎస్ఆర్‌హెచ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. భువనేశ్వర్ కుమార్ చాలా కాలంగా జట్టు పేస్ దళాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి అతడిని రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరో భారత బౌలర్ తంగరసు నటరాజన్‌ను కొనసాగించేందుకు హైదరాబాద్ యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నది. నటరాజన్‌కు లీగ్ క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్నది. 2020 ఐపీఎల్ సీజన్‌లో నటరాజన్ తన బౌలింగ్‌తో ఆకట్టుకొని ఏకంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అందుకే అతడిని జట్టుతో కొనసాగించే అవకాశం ఉన్నది. మిగిలిన ప్లేయర్లను విడుదల చేసినా.. వేలంలో జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్, మనీష్ పాండేలను తిరిగి కొనుగోలు చేయడానికి హైదరాబాద్ యాజమాన్యం ఆసక్తి చూపిస్తున్నది.



Next Story

Most Viewed