టీపీసీసీ పదవి వరించేది ఎవరిని?

by  |
టీపీసీసీ పదవి వరించేది ఎవరిని?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పు వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. రెండేళ్ళ క్రితం జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఉత్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. అప్పుడే మొదలు కావాల్సిన కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పటికీ కొలిక్కి రాలేదు. భూమి గుండ్రంగా ఉన్న చందంగా ఈ రెండేళ్ళలో కొత్తగా జరిగిందేమీ లేదు. నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా తేనెతుట్టెను కదిపినట్లే పార్టీలో ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తనకు రాకపోయినా ఫర్వాలేదుగానీ ఫలానా వ్యక్తికి రావద్దని అడ్డుకునే ప్రయత్నాలే అధికం. ఒకవైపు అధికార పార్టీ బయట నుంచి నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు అంతర్గతంగానే బలహీనపడానికి సవాలక్ష అంశాలు తోడయ్యాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని గొప్పగా చెప్పుకోవడానికే తప్ప రాష్ట్రంలో అధికారానికి ఆమడదూరంలోనే ఉండిపోయింది. యథా లీడర్ తథా కేడర్ తరహాలో ఆ పార్టీ పనితీరు ఉంది.

పీసీసీ చీఫ్ మార్పు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఆ పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధం, గ్రూపుల తగాదాలు, ఆధిపత్యం కోసం లుకలుకలు షరా మామూలే. సీనియర్ నేతలంతా ‘పీసీసీ రేసులో నేనున్నాను’ అంటూ దరఖాస్తు చేసుకున్నవారే. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, దాసోజు శ్రవణ్, వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్క.. ఇలా పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. ఎవరికి ఇచ్చినా ఇంకొరికి కోపం. సహాయ నిరాకరణ, గ్రూపుల తగాదాలు సరేసరి. ఎవరికి ఇస్తే పార్టీ ఏమవుతుందోనని ఏఐసీసీకి భయం. సీనియారిటీ, సొంత పార్టీ వారికే అవకాశం ఇవ్వాలనే వాదన, రెడ్డి సామాజిక వర్గానికి బదులుగా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్.. ఇలా అనేకం ఆ పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పీసీసీ చీఫ్ మార్పు నెత్తిమీద కుంపటిలా తయారైంది.

స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన తర్వాత కూడా రెండేళ్ళుగా కొత్త వ్యక్తిని నియమించడంలో ఆ పార్టీ మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. ఈ రెండేళ్ళలో పదుల సంఖ్యలో సీనియర్ నేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మొదలు తాజాగా విజయశాంతి, గూడూరు నారాయణరెడ్డి లాంటి నేతలంతా బీజేపీలో చేరిపోయారు. ఇంకా చాలామంది నేతలు ఆ దిశగా కర్చీఫ్ వేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఎంతమంది పోయినా చూస్తూ ఊరుకోవడమే తప్ప నివారించడానికి తీసుకున్న చర్యలు పెద్దగా లేవు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో పన్నెండు మంది అధికార పార్టీలో చేరుతున్నా వారిని కాపాడుకోలేకపోయిన నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

ఇంకా అభిప్రాయ సేకరణ దశలోనే

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఎలాగూ రెండేళ్ళ క్రితం ఇదే ప్రకటన చేసినా ఇప్పటికీ ఆయనే ఆ పార్టీకి దిక్కయ్యారు. సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు లాంటి వృద్ధతరం నేతలు కోవర్టు అని బహిరంగంగా వ్యాఖ్యానించినా పార్టీ అధిష్ఠానం ఆయనను తొలగించలేకపోయింది. తాజాగా ఉత్తమ్ ప్రకటనతో కొత్త పీసీసీ చీఫ్ కోసం వేట మొదలైంది. ఇందుకోసం ఏఐసీసీ లీడర్ల మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల అభిప్రాయాల సేకరణ కొనసాగుతూ ఉంది.

కేంద్ర స్థాయిలో అధ్యక్షుల నియామక ప్రక్రియ తరహాలోనే రాష్ట్రంలో పీసీసీ చీఫ్ వ్యవహారం కూడా ఏళ్ళ తరబడి కంటిన్యూ అవుతూనే ఉంది. నాయకత్వ మార్పు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ ఒక్కరొక్కరుగా సీనియర్ నేతలు ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇదిగో.. అదిగో అంటూ కొత్త పీసీసీ చీఫ్ ప్రకటనపై అధిష్ఠానం నుంచి చాలాసార్లు లీకులు వచ్చాయి. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు లాంటి పేర్లు వినిపించాయి. కానీ ఏదీ స్పష్టం కాకపోవడంతో ఆశావహుల్లోనే కాక కార్యకర్తల్లో సైతం నైరాశ్యం నెలకొంది.

పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకోవడమే తప్ప గ్రూపు తగాదాలను నిలువరించడంలో మాత్రం చర్యలు శూన్యం. అందుకే ఏళ్ళు గడుస్తున్నా, ఎన్నికలు వచ్చి పోతున్నా నాయకత్వం మార్పు మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే.. అనే చందంగానే ఉండిపోయింది. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోగా కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన వచ్చేనాటికి ఇంకెంతమంది వెళ్ళిపోతారో! అయినా బేఫికర్ అనే తీరులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రెండు రోజులుగా చర్చల్లో, అభిప్రాయ సేకరణలో మునిగిపోయారు. ఇక్కడి నేతల అభిప్రాయాలను ఢిల్లీకి మోసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ‘వన్ టు వన్’ మీటింగులతో ఇంకెన్ని రోజులు గడుస్తుందో! ఆ తర్వాత అధిష్ఠానం తేల్చుకుని నిర్ణయం తీసుకునే నాటికి ఇంకేం ఎన్నికలు వస్తాయో!

పీసీసీ చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తున్న నేతల్లో ఎవరికీ తనకే వస్తుందన్న నమ్మకం లేదు. ఢిల్లీ అధిష్ఠానం నుంచి సీల్డ్ కవర్‌లో నిర్ణయం వచ్చి గాంధీ భవన్‌లో ఓపెన్ చేసేంత వరకు అంతా సస్పెన్స్. ఇక్కడితో ఢిల్లీ నేతల పని అయిపోయినా రాష్ట్ర స్థాయిలో అసలు లుకలుకలు, అసంతృప్తులు, అసమ్మతి, తిరుగుబాటు, వ్యతిరేకత మొదలవుతుంది. దాన్ని చక్కదిద్దడానికి మరో పెద్ద ప్రహసనమే చేయాల్సి ఉంటుంది. గతంలో గాంధీ భవన్‌లో జరిగిన ముష్టియుద్ధాలు ఆ పార్టీ కేడర్‌కుగానీ, రాష్ట్ర ప్రజలకుగానీ కొత్తేమీ కాదు. ‘మరో వారం రోజుల్లో…’ అనే ప్రకటనలు చాలా నెలలుగానే వింటున్నాం. ఇక వేచి చూడడం తప్ప ఆశావహులు సైతం చేయగలిగిందేమీ లేదు.



Next Story

Most Viewed