పీసీసీ పీఠం.. రెడ్డీలకివ్వరా..?

by Shyam |   ( Updated:2020-02-26 06:33:05.0  )
పీసీసీ పీఠం.. రెడ్డీలకివ్వరా..?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) కుర్చీ ఎవరికి దక్కుతుందన్న విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రోజుకో కొత్త పేరు తెరమీదకు వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతల వర్గీయుల్లో, కార్యకర్తల్లో కలవరం మొదలైంది. పీసీసీ పదవిని దక్కించుకునేందుకు రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అంతాఇంతా కావు. ఎవరికి వారి ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి కుర్చీ దక్కే అవకాశం ఉందన్నఅంశంపై గాంధీభవన్‌లో చర్చ జరగుతోంది. మరోపక్క అధిష్టానం ఈసారికి రెడ్డి సామాజికవర్గాన్ని పీసీసీ చీఫ్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తోంది అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇతరులకు పీసీసీ పదవి ఇవ్వాలన్న అలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి కట్టబడితే వీరిద్దరి రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతాయోనన్న ఆందోళన కూడా ఆ పార్టీలో లేకపోలేదు.

రాష్ర్టంలో బలహీన పడుతున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, దానిలో నూతనోత్సహాన్ని నింపాలంటే టీపీసీసీ మార్పు అనివార్యం అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీనిపై అధిష్టానం కూడా దృష్టి కేంద్రీకరించి ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, టీపీసీసీ చీఫ్ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్టు కనబడుతోందని కార్యకర్తలు అంటున్నారు.

తెర పైకి మరో ఇద్దరు..

టీపీసీసీ చీప్ పదవి కోసం బలంగా ప్రయత్నిస్తున్న వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిల్లో ఏ ‘రెడ్డి’కి చీఫ్ పదవి వరించెనో అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ వ్యతిరేకి అన్న ముద్ర వేసుకున్న రేవంత్‌రెడ్డి కేంద్రంలో కూడా మంచిపేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు దీటైన వ్యక్తి కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి అనే అభిప్రాయాన్ని కార్యకర్తల్లో, ప్రజల్లో కలిగించేందుకు తనదైన కృషి చేశాడు. సూటిమాటలతో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. మరో నాయకుడు కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉండి కింది క్యాడర్ నుంచి అంచె‌లంచెలుగా ఎదిగిన నాయకుడు. అధిష్టానం దృష్టిలో గుర్తింపు పొందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో బలంగా తన వాణిని వినిపించిన నాయకునిగా ముద్ర వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. పీసీసీ పదవి ఇస్తే రాష్ర్టంలో అన్ని ప్రాంతాలపై పట్టున్న నాయకునిగా కాంగ్రెస్ పార్టీని బలోపెతం చేస్తానని చెబుతున్నాడు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వీరిద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఈసారి పీసీసీ పదవి నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, మంథని ఎమ్మెల్యే దుదిళ్ల శ్రీధర్ బాబు పేర్లు తెర మీదకు వస్తున్నాయి. శ్రీధర్ బాబుకు టీపీసీసీ బాధ్యతలు అప్పగించడంలో పార్టీలో వర్గ భేదాలను అరికట్టొచ్చన్న అలోచన అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పీసీసీ పీఠం రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతుందా..! లేక ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందా.. ! అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story