ఆస్ట్రేలియా కిచెన్‌లో ఇండియన్స్ సత్తా

by  |
indian-MasterChefs-in-Austr
X

దిశ, ఫీచర్స్: రాజపుత్రుల ప్రత్యేక వంటలు, చైనీయుల సూపులే కాదు.. వెస్ట్రన్ డిషెస్, కంట్రీ స్పెషల్స్, దాబా స్టైల్.. వంటకం ఏదైనా సరే వారి కుకింగ్ ఆర్ట్.. ఫుడ్ లవర్స్ మనసు దోచుకుంటోంది. ఆత్మారాముడిని సంతృప్తి పరచడంతో పాటు కలనరీ చాలెంజ్ పోటీలు గెలవడంలో మనవాళ్లు నిజంగా నలభీములే. భారతీయులు పాకశాస్త్ర ప్రావీణ్యం ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందింది. ఈ నేపథ్యంలో భారతీయ-ఫిజియన్ మూలాలున్న జస్టిన్ నారాయణ్ ఇటీవలే ‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా సీజన్ 13’ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక 2018లోనూ భారత సంతతికే చెందిన జైలు అధికారి శశి చెల్లయ్య ఈ కుకింగ్ షో విజేతగా నిలిచాడు. నారాయణ్, చెల్లయ్య మాత్రమే కాదు.. ఆ పోటీల్లో ప్రతీసారి ఇండియన్సే తమ కుకింగ్ టాలెంట్‌తో సత్తా చాటుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జరిగే కలనరీ పోటీల్లో ‘ఆస్ట్రేలియన్ మాస్టర్ చెఫ్’‌ మంచి ఆదరణ కలిగి ఉంది. 13 సీజన్లుగా కోట్లాదిమంది అభిమానులను గెలుకున్న ఈ కుకింగ్ షోలో ఇప్పటివరకు భారతీయ మూలాలున్న ఏడుగురు పాల్గొన్నారు. ఇక తాజా సీజన్‌‌ టైటిల్ ట్రోఫీని ఇండియన్ ఆరిజిన్ జస్టిన్ నారాయణ్‌ గెలుచుకోవడంతో పాటు 250,000 ఆస్ట్రేలియన్ డాలర్ల(దాదాపు రూ.కోటి 36 లక్షలు) ప్రైజ్‌మనీ అందుకున్నాడు. ‘నూడిల్ టాకో, స్పైస్డ్ కాండీ పొటాటో టాకో, ఇండియన్ రూస్టర్ కర్రీ, క్రిస్పీ రూస్టర్ పోర్స్ అండ్ స్కిన్, ఆపిల్, దోసకాయ పికిల్స్’ వంటి భారతీయ మూలాలతో ప్రభావితమైన వంటకాలు చేసి ఆడియన్స్‌నే కాదు, షో నిర్ణేతలను కూడా ఫిదా చేశాడు నారాయణ్.

దల్విందర్ ధామి :
మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా సీజన్-4లో పోటీ చేయడానికి దల్విందర్ ధామి అర్హత సాధించగా, ఈ కుకింగ్ పోటీలకు ఎంపికైన మొట్టమొదటి భారతీయ మూలాలున్న చెఫ్‌ తనే కావడం విశేషం. సింగపూర్‌లో స్థిరపడ్డ దల్విందర్.. అక్కడి ప్రత్యేక వంటకాలతో పాటు ఉత్తర భారతీయ ‘తడ్కాస్’తో మాస్టర్ చెఫ్ కిచెన్‌లో ఘుమఘుమలు పంచింది. ఇక తన వంట రుచి చూసిన షో మాజీ జడ్జి జార్జ్ కొలాంబరిస్.. తను ఇప్పటివరకు రుచి చూసిన ఉత్తమమైన డిష్ ఇదేనంటూ ప్రశంసించాడు. ఈ షోలో ఆమె గెలవకపోయినా, ఆ తర్వాత ఎంతోమంది ఈ బాటలో నడిచేందుకు స్ఫూర్తిగా నిలిచింది. మాస్టర్ చెఫ్ పోటీల తర్వాత దల్విందర్.. సాసెస్‌తో పాటు ఇండియన్ మసాలాలను సింగపూర్ స్థానిక మార్కెట్‌లో విక్రయించడం ప్రారంభించింది.

నేహా సేన్ అండ్ రిషి దేశాయ్ (సీజన్ 5) :
నేహా సేన్ తన తల్లి శిక్షణలో కుకింగ్ జర్నీ ప్రారంభించింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన నేహా.. ‘మాస్టర్ చెఫ్’ ఐదో సీజన్‌లో పార్టిసిపేట్ చేసింది. ఈ క్రమంలో భారతీయ వంటకాలంటే.. చికెన్, కుర్మాలే కాదు, ఇంకా ఎన్నో రుచుల మేళవింపు అని నిరూపించింది. మాస్టర్ చెఫ్ వేదికపై ఆమె చేసిన ఐస్‌క్రీములు, పచ్చళ్లు న్యాయనిర్ణేతల మనసు గెలుచుకున్నాయి. ఈ షో తర్వాత తను ఇండియన్-ఇన్‌స్పైర్డ్ ఐస్‌క్రీమ్, చట్నీలతో కూడిన ఓ స్టోర్ ప్రారంభించి 20కి పైగా ఫుడ్ టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని హై-ఎండ్ కేఫ్స్, బిస్ట్రో, రెస్టారెంట్లతో సహా దాదాపు 250 స్టోర్స్‌లో నేహా తయారుచేసిన ఐస్‌క్రీమ్స్ లభిస్తున్నాయి.

దీపాలి బెహర్ (సీజన్ 6):
గుజరాతీలో పుట్టిన దీపాలి ఆస్ట్రేలియాలో స్థిరపడింది. మొదట బంగాళాదుంప కూరతో ‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా’ న్యాయమూర్తులను ఆకట్టుకున్న దీపాలి.. ఈ క్రమంలో చికెన్ కర్రీ, పాట్ స్టిక్కర్స్, గుజియా వంటి అనేక పాపులర్ వంటకాలను రూపొందించింది. ప్రస్తుతం ఆమె ‘దీపాలి డిలైట్స్’ బ్రాండ్ పేరుతో పికిల్స్ విక్రయిస్తోంది.

శశి చెల్లయ్య (సీజన్ 10):
తమిళనాడు, మధురైకి చెందిన శశి తన ‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా’ ప్రయాణంలో భారతీయ, మలయ్, చైనీస్ వంటల‌తో ఆహారప్రియుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొదట సింగపూర్‌లోని తన కేఫ్‌లో వంటశాలలో తల్లికి సాయంగా ఉంటూ కుకింగ్ నేర్చుకున్నాడు. అంతకు ముందు, మహిళా జైలులో అధికారిగా పనిచేసిన శశి.. సీజన్‌9లోనే మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియాలో పార్టిసిపేట్ చేయగా, పలు కారణాల వల్ల మధ్యలోనే వెళ్లిపోయాడు. సీజన్ 10లో కమ్ బ్యాక్ చేయడమే కాకుండా టైటిల్‌ కూడా గెలుచుకున్నాడు.

సందీప్ పండిట్ (సీజన్ 11):
సందీప్.. రోగన్ జోష్ , యఖ్ని, హఖ్ వంటి ఇండియన్ మీటీ డిలీషియస్ వెరైటీలను ప్రపంచానికి అందించాడు. ఈ మేరకు అనేక కశ్మీరీ సంప్రదాయ వంటలను పున: సృష్టించి న్యాయమూర్తుల కితాబు అందుకున్నాడు.

దీపిందర్ చిబ్బర్ (సీజన్ 13):
సీజన్13లోని బలమైన పోటీదారుల్లో దీపిందర్ ఒకరు. ‘తందూరి చికెన్ విత్ ఫ్లేమ్ గ్రిల్డ్ నాన్, స్మోక్డ్ లస్సీ, ఫ్రెంచ్ చౌక్స్ పేస్ట్రీ, మిల్లీ-ఫ్యూయెల్ విత్ చిల్లీ చాక్లెట్’ వంటి భిన్నమైన డిషెస్‌ను దేశీ టచ్‌తో అందించి అందరినీ ఇంప్రెస్ చేసింది. సీజన్ అంతటా తన ప్రతిభతో విస్మయం కలిగించింది.



Next Story

Most Viewed