రాజు సూసైడ్‌పై ఇంకా మిస్టరీనే.. మౌనిక ఎంట్రీతో ట్విస్ట్..

by  |
రాజు సూసైడ్‌పై ఇంకా మిస్టరీనే..  మౌనిక ఎంట్రీతో ట్విస్ట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి, ప్రాణం తీసిన పులికొండ రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో సరికొత్త చర్చకు దారితీసింది. పోలీసుల చేతికి మట్టంటకుండానే నిందితుడు శవమయ్యాడు. రైల్వే ట్రాక్​ ఖాతాలో ఈ చావు చేరింది. ఘాతుకానికి పాల్పడిన రాజు ఏ రీతిలో చనిపోయినా తగిన శాస్తి జరిగిందని ఓ వైపు ప్రజలు అభిప్రాయపడుతుంటే.. నాలుగు రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్న తన కొడుకు చివరకు ఇలా శవమయ్యాడని మృతుడి తల్లి వీరమ్మ ఆరోపించింది. మౌనికను పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని నాశనం చేసిన రాజు ఆరేండ్ల చిన్నారిని కూడా ఛిదిమేశాడని, ఇప్పుడు చనిపోయిన వార్త తనకు సంతోషంగా ఉందని అత్త యాదమ్మ వ్యాఖ్యానించింది. ‘ఇంతటి కిరాతకానికి పాల్పడిన నిందితుడిని వదిలే ముచ్చటే లేదు, ఎన్‌కౌంటర్ చేయాలి’ అని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కామెంట్ చేసిన రెండు రోజులకు రాజు కథ కొలిక్కి రావడం గమనార్హం.

కేటీఆర్​కు ముందే తెలుసా..?

నిందితుడు రాజు పోలీసుల అదుపులో ఉన్నాడంటూ ఐదు రోజుల కిందటే మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. తాజాగా కూడా మంత్రి కేటీఆర్​ మరోసారి ట్వీట్​ చేశాడు. ‘నిందితుడు రాజు ఆత్యహత్య చేసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సమాచారం అందించారు. నిందితుడు రాజు మృతదేహం వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌ వద్ద రాజు మృతదేహం లభ్యమైందని తెలంగాణ డీజీపీ ట్వీట్‌ చేశారు. రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహంపై మౌనిక అని పచ్చబొట్టు ఉండటంతో నిందితుడు రాజు అని నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్​ ట్వీట్లపై సెటైర్లు ఎక్కువయ్యాయి. రాజు ఆత్మహత్యను సమర్థిస్తూనే.. మంత్రి కేటీఆర్​కు ముందే తెలుసా.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల హడావుడి

వాస్తవానికి రాజు పోలీసుల అదుపులో ఉన్నాడని తల్లి వీరమ్మ చెబుతున్నా రాష్ట్ర ప్రజానీకం ఆత్మహత్యను హర్షిస్తూనే ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇటీవల దీనిపై చాలా హడావుడి చేశారు. పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు వేశారు. బార్లు, మద్యం దుకాణాలు, బస్సులు, రవాణా వ్యవస్థను మొత్తం అప్రమత్తం చేశారు. పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. కానీ ఎవరికీ అంతుచిక్కకుండా.. స్టేషన్​ ఘన్​పూర్​ వరకు వెళ్లిన రాజు.. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ నిందితుడి కోసం అష్టకష్టాలు పడిన పోలీసులకు మాత్రం సజీవంగా చిక్కలేదు.

హర్షం.. ఆరోపణల పర్వం

ఈనెల 9న సైదాబాద్‌లో చిన్నారిని చంపేసిన తర్వాత ఆచూకీ లేకుండా పోయిన రాజు కోసం రాష్ట్రమంతా 1,000 మంది పోలీసులు గాలిస్తున్న తరుణంలో రైలు పట్టాలపై శవంగా కనిపించడం సంచలనం రేకెత్తించింది. రాజు చనిపోవడంపై కొన్నిచోట్ల ప్రజలు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. మరోవైపు మరణ వార్తను పోలీసుల ద్వారా తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు మృతదేహాన్ని చూసిన తర్వాతే నమ్ముతామంటూ పట్టుబట్టారు. మృతదేహాన్ని తమకు చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని మృతదేహాన్ని చూపించడానికి చిన్నారి మేనమామ, సింగరేణి కాలనీకి చెందిన ఐదుగురిని వారి వాహనంలోనే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజు చనిపోవడంపై సైదాబాద్ స్థానికులు, జనగామ, వరంగల్ జిల్లా ప్రజలు తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇంతగా పోలీసులు గస్తీ తిరుగుతుంటే రైల్వే ట్రాక్ వరకు ఎవరి కంటా పడకుండా నిందితుడు ఎలా చేరుకోగలిగాడనే సందేహాలను కొందరు వ్యక్తం చేశారు.

నన్ను ఉప్పల్​ దాకా తీసుకొచ్చారు

ఘటనపై నిందితుడు రాజు భార్య మౌనిక అడ్డగూడూరు మండల కేంద్రంలో మాట్లాడింది. తన భర్తను పోలీసులే చంపేశారంటూ అనుమానం వ్యక్తం చేసింది. తనకు, తన బిడ్డకు, అత్తకు న్యాయం చేయాలని వేడుకుంది. పోలీస్ స్టేషన్‌లో 10 రోజులు ఉంచారని, ఒకసారి దొరికాడని చెప్పారు. ఇంకోసారి దొరకలేదన్నారని, బుధవారం పేపర్‌ మీద సంతకాలు పెట్టించుకున్నారని తెలిపింది. ఎందుకు సర్ అని అడిగితే ఊరికే అని చెప్పారని, బుధవారం కూడా ఉప్పల్ దాకా తీసుకొచ్చి బస్సు ఎక్కిచ్చి డబ్బులిచ్చారని తెలిపింది. అప్పుడు వీడియో కూడా తీశారని, పోలీసులే చంపేశారని అనుకుంటున్నామని, ఇప్పుడు పాపతో తాను ఎలా బతకాలని, న్యాయం చేయాలంటూ వేడుకుంది.

అప్పుడూ.. ఇప్పుడూ సంతోషమే..

వరంగల్​లో 2008లో సూసైడ్​ ఘటనలో ముగ్గురి ఎన్​కౌంటర్​, ఇటీవల దిశ కేసులో నలుగురి ఎన్​కౌంటర్​.. ఇలాంటి ప్రక్రియ రాష్ట్ర ప్రజానీకాన్ని సంతోషంలో పడేసింది. పోలీసులను పొగిడారు. కానీ ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులు మాత్రం కోర్టు మెట్లెక్కారు. ఇంకా విచారణ సాగుతోంది. కానీ ఈసారి మాత్రం పోలీసులు బతికిపోయారు. రాజు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వ పరువు కూడా నిలిచింది.


Next Story

Most Viewed