ఏజెంట్లకు ప్రలోభాలతో ఎర..

by  |
ఏజెంట్లకు ప్రలోభాలతో ఎర..
X

దిశ ప్రతినిధి, మెదక్ : గెలుపు కోసం క్షేత్రస్థాయిలో అభ్యర్థులు, నాయకులు చెమటోడ్చి తిరిగినా పోలింగ్ బూత్‌లోని ఏజెంట్ల వ్యవహార శైలిపైనే ఆయా అభ్యర్థుల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. అనుమానాస్పద ఓటింగ్‌ను అడ్డుకోవడం, పోలింగ్ బూత్‌లలో అక్రమాలను నివారించడంలో ఏజెంట్ల పాత్ర కీలకం. ఏజెంట్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు వారు సహకరిస్తే ఆయా అభ్యర్థుల జాతకాలు తారుమారయ్యే అవకాశాలుంటాయి. దీంతో ఆయా పార్టీలు పోలింగ్ ఏజెంట్లుగా ఎవరుంటే బాగుంటందని అంచనా వేస్తూ ప్రతి పోలింగ్ బూత్‌కూ సమర్థులైన వారిని ఎంచుకోవడంలో అభ్యర్థులు తలమునకలయ్యారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంపిక చేసుకున్నవారిని ఆయా పార్టీలు ప్రలోభాలకు గురిచేసినట్టు తెలుస్తోంది.

వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఎన్నికల విధులకు నియమిస్తారు. ఇటువంటి సమయంలో ఓటరు ఎవరో తెలిసిన వ్యక్తి పోలింగ్ ఏజెంట్ మాత్రమే. అంతేకాకుండా ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాలన్నింటినీ అభ్యర్థి ఒక్కరే పర్యవేక్షించడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రానికీ ఆయన తరఫున ఒక ఏజెంటును నియమించుకుంటారు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఏజెంట్లే కీలకం కావడంతో దుబ్బాకలో తమ పార్టీ తరఫున ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎవరిని ఏజెంట్లుగా నియమించాలోనన్న పనిలో ఆయా పార్టీల అభ్యర్థులు తలమునకలయ్యారు. ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొనే నమ్మకస్తుల కోసం వేట మొదలు పెట్టి ఎంపిక చేసుకున్నారు. పోలింగ్ ఏజెంట్లు‌గా వుండే వారికి ఆయా పార్టీల అభ్యర్థులు పోలింగ్ బూత్‌లో వ్యవహరించాల్సిన విధానంపై శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏజెంట్లకు ప్రలోభాలతో ఎర..

ఆయా పార్టీల తరఫున పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేది ఎవరో ఖరారు కావడంతో వారిని ప్రలోభాలకు గురిచేయడం కూడా ఆయా అభ్యర్థులు షురూ చేశారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ ఇలాంటి ప్రలోభాలకు తెరలేపిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ తమ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తూ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తమకు సమాచారం ఉందంటూ ఎన్నికల అధికారికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా నాయకుల అవసరాన్ని ఆసరగా చేసుకొని ఆయా పార్టీల కార్యకర్తలు ఏజెంట్లుగా కొనసాగేందుకు పోటీ పడుతున్నారు.

అభ్యర్థుల్లో మొదలైన గుబులు

ఇన్నాళ్లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల గుండెల్లో పోలింగ్ గుబులు మొదలైంది. తాము చేసిన ఎన్నికల ప్రచారం ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు భారీగానే ఎన్నికల బరిలో నిలవడంతో తమ ఓట్లు చీలే అవకాశాలు ఏమైనా ఉన్నాయోమోననే అనుమానం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది.

పోలింగ్ ఏజెంట్ విధులు…

పోలింగ్‌ ఏజెంట్లను నియామకానికి సంబంధించి ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. ఏజెంట్‌ అదే పోలింగ్‌ బూత్‌ ఓటరుగా ఉండాలి. తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉండాలి. ఏ పార్టీ అభ్యర్థి తరఫున ఏజెంట్‌గా ఉంటున్నారో ఫారమ్‌-బీ ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారికి ఇవ్వాలి. ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి గంట ముందే ఏజెంట్లు కేంద్రానికి చేరుకోవాలి. మాక్‌ పోలింగ్‌లో పాల్గొనాలి. ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి పోలింగ్‌ కేంద్రానికి ఒక ఏజెంటు, ఇద్దరు ప్రత్యామ్నాయ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోలింగ్‌ ఏజెంట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకూ కేంద్రంలోనే ఉండాలి. ఓటరు జాబితాను స్టేషన్‌ బయటకు తీసుకెళ్లకూడదు. అత్యవసర పరిస్థితుల్లో పోలింగ్‌ ఏజెంట్‌ కేంద్రాన్ని విడిచి వెళ్లాల్సివస్తే ఆ పార్టీకే చెందిన మరో ఏజెంటు సిద్ధమైన తరువాత మాత్రమే కేంద్రాన్ని విడిచి వెళ్లాలి. పోలింగ్‌ ఏజెంట్లు కేంద్రంలోకి వచ్చే సమయం, వెళ్లే సమయం ప్రత్యేక పుస్తకంలో నమోదు చేయాలి. ఎన్నికల నిర్వహణలో ఉన్న సిబ్బందికి పూర్తిగా అతడు సహకరించాలి. పోలింగ్‌ ఏజెంట్లు ప్రలోభాలకు గురిచేయకూడదు. కేంద్రంలో ఏజెంట్లు ఓటర్లు కేంద్రంలోకి వచ్చేటప్పుడు వారి ముఖాలు కనిపించేలా ఉండాలి. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఏజెంట్ల తరువాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు ఈ వరుస క్రమంలో కూర్చోవాలి.

Next Story

Most Viewed