కామారెడ్డిలో ఆ పోస్టులు ఖాళీ అయ్యాయి.. భర్తీ చేసేదెప్పుడు..?

by  |
కామారెడ్డిలో ఆ పోస్టులు ఖాళీ అయ్యాయి.. భర్తీ చేసేదెప్పుడు..?
X

దిశ, కామారెడ్డి : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేసే ఉన్నత అధికారులు వాళ్లు. కింది స్థాయి అధికారులతో పని కాకపోతే వారి వద్దకు వెళ్లి జనం తమ గోడు చెబుకుంటారు. అసలే జిల్లా కేంద్రం.. డివిజన్ స్థాయి అధికారులు వాళ్లు.. అలాంటి అధికారుల పోస్టులు సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్నాయి. ఆరు నెలలుగా ఆర్డీవో పోస్టు, మూడున్నర నెలలుగా డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంటున్నాయి. వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వమే తాత్సారం చేస్తుందా.. లేక ఇక్కడికి రావడానికి అధికారులే జంకుతున్నారా అనేది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది.

డివిజన్ కేంద్రంగా ఉన్న కామారెడ్డి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రానికి అనుగుణంగా వ్యాపార లావాదేవీలు ఇక్కడ జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య పరిష్కార బాధ్యత కూడా డివిజన్ స్థాయి అధికారుల పైనే ఉంటుంది. అలాంటిది ఆ డివిజన్ స్థాయి అధికారుల కొరత ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. కామారెడ్డి డివిజన్ పరిధిలో కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, దోమకొండ, బిక్కనూర్, బీబీపేట మండలాలు ఉన్నాయి. కొత్త మండలాలుగా ఏర్పడిన రామారెడ్డి, రాజంపేట మండలాల్లో కొన్ని గ్రామాలు ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాలకు డివిజన్ స్థాయి అధికారులుగా ఆర్డీవో, డీఎస్పీ ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు ఖాళీగా ఉండడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

మూడు నెలల క్రితం డీఎస్పీ అరెస్ట్

కామారెడ్డి డీఎస్పీగా పని చేసిన లక్ష్మీనారాయణ అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో సీఐ ఇంట్లో డీఎస్పీకి సబంధించిన ఆస్తి పత్రాలు లభించాయి. క్రికెట్ బెట్టింగ్ విషయంలో డీఎస్పీ పాత్ర లేకపోవడంతో అక్రమాస్తులను కూడబెట్టారన్న విషయంపై ఏసీబీ అధికారులు డీఎస్పీ కార్యాలయంలో సైతం సోదాలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో కూడా దాడులు చేయగా సుమారు రూ. 2 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు డీఎస్పీ లక్ష్మీనారాయణను డిసెంబర్ 5 న అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. డిసెంబర్ 12 న ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డికి కామారెడ్డి డీఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఆరు నెలల క్రితం ఆర్డీవో సస్పెండ్

కామారెడ్డి ఆర్డీవోగా పని చేసిన నరేందర్ గతంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం తహసీల్దార్ గా పని చేసిన సమయంలో ఓ ప్రభుత్వ భూమిని అసైన్డ్​భూమిగా మార్చారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడంతో ఆయనపై విచారణ చేపట్టారు. విచారణలో ఆర్డీవో నరేందర్ హస్తం ఉందని తేలడంతో గత సంవత్సరం సెప్టెంబర్ 15 వ తేదీన ఆయనను సస్పెండ్ చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

డివిజన్ స్థాయి అధికారులు లేక ఇబ్బందులు

ప్రస్తుతం డివిజన్ స్థాయి అధికారులైన డీఎస్పీ, ఆర్డీవోల లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ శాఖలో సైతం ముఖ్యమైన పనులు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది. ఇన్​చార్జిగా ఉన్న అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ దృష్టి పెట్టే అవకాశం లేకపోవడంతో పనులు కుంటుపడుతున్నాయి. కామారెడ్డి డీఎస్పీ, ఆర్డీవో ఇన్​చార్జిలుగా ఇద్దరు అధికారులు కూడా ఎల్లారెడ్డి వారే కొనసాగుతున్నారు. ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే వారు వస్తున్నారు. ఏదైనా సమాచారం అడిగినా వారికంటే పై అధికారులనే అడగాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కామారెడ్డిలో నెలకొన్నాయి.

సుముఖత చూపడం లేదా..?

కామారెడ్డి ఆర్డీవో, డీఎస్పీలుగా పూర్తి స్థాయి అధికారులను ఇప్పటి వరకు ప్రభుత్వం నియమించలేదు. మరోవైపు ఇక్కడ పని చేయడానికి ఎవరు కూడా సుముఖత చూపడం లేదని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఇన్​చార్జిల పాలన ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్డీవో లేక ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ కే చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డీఎస్పీ లేకపోవడంతో పలు ముఖ్యమైన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రతీ శనివారం డీఎస్పీ కార్యాలయంలో కొనసాగే ఫ్యామిలీ కౌన్సెలింగ్​కూడా జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కామారెడ్డికి డీఎస్పీ, ఆర్డీవోలను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed