స్కూళ్లు, కాలేజీలు ఎప్పటినుంచి?

by  |
స్కూళ్లు, కాలేజీలు ఎప్పటినుంచి?
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యాసంవత్సరం సగం కంటే ఎక్కువగానే గడిచిపోయింది. లాక్‌డౌన్ తర్వాత అకడమిక్ ఇయర్‌ను ఎలా ప్రారంభించాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విద్యాసంస్థలు ఇష్టం వచ్చిన రీతిలో క్లాసులు నిర్వహిస్తున్నాయి. పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అకడమిక్ ఇయర్‌ను ప్రారంభించేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినా సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అయోమయం నెలకొంది.

విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు చెబుతున్నారు. అవి అర్థం కాక వారు ఇబ్బందులు పడుతున్నారు. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పై తరగతుల్లో జాయిన్ అయ్యేందుకు తేదీలను పొడిగిస్తూ వెళ్తున్నారు. భౌతిక తరగతులు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి డిమాండ్ పెరుగుతున్నా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వారంతపు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తరగతి గది బోధన ఎప్పడు ప్రారంభిస్తారో, లాక్‌డౌన్ సమయాన్ని ఎలా సర్ధుబాటు చేస్తారో ‌స్పష్టత లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

జీరో ఇయర్ చేస్తారా?

అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో 220 రోజులు ఉంటాయి. అందులో ఇప్పటికే 80 శాతం ముగిసిపోయాయి. ఈసారి విద్యా సంవత్సరం ఉంటుందా.. జీరో ఇయర్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ ఫీజులను వసూలు చేస్తున్నాయి. జీరో ఇయర్ చేస్తే తామంతా నష్టపోతామని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తే గడిచిన కాలానికి సంబంధించిన షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. వచ్చే అకాడమిక్ ఇయర్‌ యథావిధిగా కొనసాగింపునకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉండటంతో అందుకు అనుగుణంగా మార్చులు అవసరమవుతాయి.

సిలబస్‌ తగ్గిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది. తొలగించిన సీబీఎస్‌ఈ పాఠాలను కూడా చేర్చినట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు నష్టపోకుండా సిలబస్ అంతా బోధించడం ఒక ఎత్తయితే.. పరీక్షలు నిర్వహించే విధానం కూడా ఒక సమస్యగా మారనుంది. పరీక్షలు, సిలబస్, బోధనల్లో మార్పులను కూడా విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఎక్కువ సమయంలేని ఈ పరిస్థితుల్లో సీఎం నిర్ణయంపైనే విద్యావ్యవస్థ మనుగడ ఆధారపడి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

కదలిక లేదు

లాక్‌డౌన్ అనంతరం విద్యావ్యవస్థను పున:ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఓపీని విడుదల చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తరగతి గది బోధనలను ప్రారంభించింది. మార్చి నెలలో చివరిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ గడిచిపోతున్నా సర్కారు కదలిక లేదు. అకడమిక్ ఇయర్‌ను ప్రారంభించే విషయంలో విద్యాశాఖ అధికారులు పలు రకాల ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని భావించినప్పటికీ, అది జరగలేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా అకడమిక్ ఇయర్‌ను ప్రారంభించడం సాధ్యపడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు, రాజకీయ అంశాలపై వేగంగా స్పందిస్తున్న ముఖ్యమంత్రి లక్షల సంఖ్యలో విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం చేసే అంశంపై దృష్టి సారించకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీలో తరగతి గది బోధన

కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో విద్యార్థులు నష్టోపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లాక్‌డౌన్ సమయాన్ని భర్తీ చేసేందుకు పండుగ సెలవులను రద్దు చేయడంతో పాటు 180 రోజుల అకాడమిక్ క్యాలెండర్‌ను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ రెండు నుంచి పాఠశాలలను ప్రారంభించి, 30 శాతం సిలబస్‌ తగ్గించింది. శానిటైజేషన్ చేయడంతో పాటు భౌతిక దూరాన్ని అమలు చేసేలా మార్గనిర్దేశకాలు విడుదల చేసింది. వారానికి మూడు సార్లు స్కూల్‌కు వచ్చేలా ఒక్కో క్లాస్‌కు షెడ్యూల్ తయారు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఓపీ విడుదల చేసిన తక్షణమే అక్కడి ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.



Next Story

Most Viewed