FB, వాట్సాప్ 50 నిమిషాలు నిలిచిపోతేనే అల్లాడారు.. కానీ బెంగాల్‌లో 50 ఏండ్లుగా అలాగే..

by  |
pm modi comments on bengal cm
X

దిశ, వెబ్‌డెస్క్: సామాజిక మాధ్యమ దిగ్గజాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంల సేవలు దేశవ్యాప్తంగా శుక్రవారం రాత్రి 50 నిమిషాలు ఆగిపోతేనే జనాలు అల్లాడిపోయారని, కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం అభివృద్ధి 50 ఏండ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా శనివారం ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మమతా బెనర్జీపై మరోసారి నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘శుక్రవారం రాత్రి సుమారు గంట పాటు ఎఫ్‌బి, వాట్సాప్ సేవలు ఆగిపోతేనే అందరూ ఆందోళనకు గురయ్యారు. కానీ బెంగాల్‌లో యాభై ఏళ్లుగా అభివృద్ధి, ప్రజల కలలు అలాగే నిలిచిపోయాయి. ఇందుకు మొదటి కారణం కాంగ్రెస్ అయితే రెండో కారణం వామపక్షాలు, ఇప్పుడు టీఎంసీ’ అని అన్నారు. ఆ మూడు ప్రభుత్వాల విధ్వంసాలు చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. డెబ్బై ఏళ్ల పాటు వారి పాలనను చూసిన ప్రజలు.. తమకు ఒక్క ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే బెంగాల్‌ చూసిన ఆ విధ్వంసం నుంచి విముక్తి కల్పిస్తానమి తెలిపారు.

మమతా బెనర్జీ పదేళ్ల పాలన, టీఎంసీపై స్పందిస్తూ.. బెంగాల్ ప్రజలు దీదీని నమ్మితే ఆమె వారికి ద్రోహం చేసిందని విమర్శించారు. టీఎంసీ అంటే క్రూరత్వానికి పాఠశాల వంటిదని.. ఆ స్కూల్‌లో టోల్‌బాజీ, కట్ మని (బెంగాల్ లో టీఎంసీ హయాంలో జరిగిన కుంభకోణాలు) వంటివి సిలబస్‌గా ఉంటాయని ఆరోపించారు. ప్రజలను హింసించడానికి అక్కడ శిక్షణనిస్తారని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed