కోమటిరెడ్డిది దుస్సాహాసమేనా.. ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి…?

by  |
komatireddy
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలపై కొండంత ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అధిష్టానం నుంచి ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరు ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పీసీసీ అధ్యక్ష బాధ్యతలను రేవంత్‌కు కట్టబెడతారనే ప్రచారం ముందు నుంచి ఉంది. అయితే రేవంత్‌కు టీపీసీసీ ఇచ్చే అంశాన్ని సొంత పార్టీ నేతలే వీలు చిక్కినప్పుడల్లా బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ రేసులోకి రేవంత్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపింది.

ఈ క్రమంలోనే రేవంత్ పేరు ప్రకటించగానే.. అసంతృప్తి నేతల నుంచి వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలను హెచ్చరించింది. కొత్త టీపీసీసీగా రేవంత్ వ్యవహారంపై ఎవ్వరూ నోరెత్తద్దనే సంకేతాలను పంపించింది. కొంతమందికి రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఫోన్ చేసి వాకబు చేసినట్టు సమాచారం.

హీటెక్కించిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు..

ఇలాంటి పరిస్థితుల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా దుమారం రేపింది. చివరకు పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌పై అవినీతి ఆరోపణలు చేయడం సొంత పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. వాస్తవానికి కోమటిరెడ్డికి పీసీసీ దక్కకపోతే.. అలగడమో.. లేదా స్తబ్దుగా ఉండిపోవడమో చేస్తారని అంతా భావించారు. కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంత పార్టీ నేతలపై పదునైన అస్త్రాలను సంధించడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది.

ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కొత్త టీపీసీసీ, పార్టీ ఇన్‌ఛార్జిపై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనంటూ చేసిన సంకేతాలు దేనికనేది అర్థం కావడం లేదు. వాస్తవానికి కోమటిరెడ్డి వర్గం ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనూ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారతారా..? అన్న ప్రచారం లేకపోలేదు. అయితే అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచనలో లేరని, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ మారేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. నిజానికి రాజగోపాల్ రెడ్డి ఎప్పట్నుంచో బీజేపీలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. ఇదే అవకాశంగా బీజేపీలోకి వెళతారా.. లేదా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా అన్నది తేలాల్సి ఉంది.

స్వయంకృతాపరాధమేనా..

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రస్తుతం పార్టీ కమిటీల్లో కనీస ప్రాధాన్యత దక్కలేదనే చెప్పాలి. ఇటు పీసీసీలో.. అటు ఏఐసీసీలోనూ వారికి ప్రాతినిధ్యం దక్కలేదు. ఇదే సమయంలో పార్టీ ఇతర కమిటీల్లోనూ అధిష్టానం వారిని నియమించలేదు. దీంతో కోమటిరెడ్డి వర్గం తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లింది. వాస్తవానికి కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడే.. వారికి ఆ పరిస్థితిని తెచ్చిపెట్టిందనే ప్రచారం లేకపోలేదు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఇన్‌ఛార్జి, అప్పటి టీపీసీసీని సైతం వదల్లేదు. దీనికితోడు ఒకానొక దశలో బీజేపీలోకి చేరినంత పనిచేశారు.

తాజాగా గత ఏడేండ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ప్రగతి భవన్‌కు వెళ్లి ఇతర నేతలతో సీఎం కేసీఆర్‌ను కలిశారు. పార్టీకి ఏలాంటి సమాచారం లేకుండా ప్రగతిభవన్‌కు వెళ్లడంపై అధిష్టానం సైతం గుస్సా అయినట్టు తెలుస్తోంది. దీనికితోడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇటీవల ఢిల్లీలో బీజేపీ నేతలతో రహస్య మంతనాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story