సీఎం మదిలో ఏముంది?

by  |
సీఎం మదిలో ఏముంది?
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశమే కాక యావత్తు ప్రపంచమే అబ్బురపోయే విధంగా రైతుల కోసం అద్భుతమైన పథకాన్ని వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గంలో కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రైతుల్లో చర్చ మొదలైంది. అబ్బురపోయే పథకం ఏమై ఉంటుందా అని అధికారుల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలకు కూడా ఈ విషయం అంతుబట్టడంలేదు. అయితే సీఎంతో సన్నిహితంగా ఉన్న ఒకరిద్దరికి మాత్రం దీని గురించి కనీస స్థాయిలో సమాచారం ఉంది. రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మొదలు ఐక్య రాజ్య సమితి వరకు ప్రస్తావించిన అంశంగా ఉన్నట్లుగానే ఇకపైన కొత్తగా ప్రకటించబోయేది కూడా ఉంటుందనేది కేసీఆర్ నమ్మకం.

అలాంటి అబ్బురపోయే పథకం గురించి ఆర్థిక శాఖ అధికారుల దగ్గర ఆరా తీయగా ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడనుందనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం చెప్పిన పంట వేసిన రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పత్తి సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధరపైన అదనంగా బోనస్ ఇవ్వడం, రాష్ట్రంలోని రైతులందరికీ ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం లాంటివి చూచాయగా బైటకొచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ పేరుతో అమలుచేస్తున్నప్పటికీ దాని ద్వారా రైతులకు చాలా తక్కువ స్థాయిలోనే లబ్ధి కలుగుతోంది. అయితే, దీని పరిధిని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. రైతుబంధుకు ఏటా రూ. 12 వేల కోట్ల కంటే ఎక్కువ కేటాయిస్తున్నా చివరికి రూ. 10 వేల కోట్లు దాటడంలేదు. రైతుబీమాకు రూ. 1000 కోట్లకంటే ఎక్కువ కేటాయింపు జరుగుతున్నా రూ. 700 కోట్లకు మించడంలేదు. ఇప్పుడు అదనంగా ఈ సంచలన పథకాలకు ఎంత భారం పడుతుందనేదానికి అనుగుణంగా సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఉచిత పంటల బీమా :

ఫసల్ బీమా యోజన పథకం కేంద్రానిదే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం వాటాను భరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు పది లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తిస్తోంది. ఇందుకు మొత్తం రూ. 600 కోట్లు ఖర్చు అవుతూ ఉంటే ఇందులో రూ. 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జమ చేస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పుడు కోటి ఎకరాలకు పైగా సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ మొత్తం సాగుభూమికి బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొచ్చినట్లయితే గరిష్టంగా రూ. 6000 కోట్లు దాటక పోవచ్చని ఆర్థిక శాఖ అధికారుల అంచనా. కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశించకుండా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా దీనికి రూపకల్పన చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీలతో మాట్లాడితే దీన్ని నాలుగు వేల కోట్ల రూపాయలకు కూడా తగ్గించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ విధంగా మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు వర్తింపజేసినా గరిష్టంగా రూ. 5000 కోట్లు దాటకపోవచ్చన్నది వారి భావన.

చెప్పిన పంట వేసిన రైతులకు ప్రోత్సాహకం :

రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, మార్కెట్‌లోని డిమాండ్‌కు తగినట్లుగా ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేయాలో ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పంటలు వేసిన రైతులకు ప్రోత్సాహకం పేరుతో సీజన్‌కు కొంత చొప్పున నగదు సాయం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఎలాగూ వరి పంట విస్తీర్ణంలో పెద్దగా మార్పు లేదు. గతేడాదికంటే కేవలం లక్ష ఎకరాలకంటే ఎక్కువ మార్పు లేదు. మొక్కజొన్న విషయంలో మాత్రమే ప్రభుత్వం ఈ సీజన్‌లో వేయవద్దంటూ నొక్కిచెప్పింది. మొక్కజొన్నకు బదులుగా కందులు, పత్తి, ఇతర పంటలు వేయాల్సిందిగా సీఎం సూచించారు. అలాంటి రైతులకు ప్రోత్సాహకం పేరుతో కొంత నగదు సాయం ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొక్కజొన్న వేయని రైతులకు వస్తుందా లేదా గతేడాది పత్తి వేయకుండా ప్రభుత్వ సూచన మేరకు ఈసారే ఆ పంట వేసిన రైతులకు వస్తుందా లేక మొత్తం రైతులందరికీ వస్తుందా అనేదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం బైటకు రాలేదు.

పత్తి రైతులకు బోనస్ :

ఈసారి అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్ ఉన్నట్లుగా అగ్రో ఎకనమిస్టులు చేసిన సూచన మేరకు ముఖ్యమంత్రి ఈ పంట సాగును పెంచాలని సూచించారు. గతేడాది 53 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైతే ఈసారి సుమారు 65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించి కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్ళు జరిగి మొత్తం పత్తి పంటను రైతులు విక్రయించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా హెచ్చు మొత్తంలో పత్తిని సాగుచేయడానికి రైతులు ముందుకొచ్చినందువల్ల వారికి బోనస్‌గా కనీస మద్దతు ధరమీద కొంత అదనంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిసింది. ఒక్కో ఎకరానికి అంచనా ప్రకారం గరిష్ట స్థాయిలో పది క్వింటాళ్ళ చొప్పున పత్తి దిగుబడి వచ్చినా ఒక్కో క్వింటాల్‌కు రూ. 1000 చొప్పున రైతులకు బోనస్‌గా ఇస్తే రూ. 6,500 కోట్ల భారం పడవచ్చని ఆర్థికశాఖ అంచనా. ఒకవేళ రూ. 500 చొప్పున మాత్రమే ఇస్తే ఇందులో సగమే భారం పడుతుంది. అందువల్ల బోనస్‌గా పత్తి రైతులకు ఎంత చొప్పున ఇవ్వాలనేదానిపై రానున్న వారం రోజుల్లో ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

విత్తనాలు, ఎరువుల కోసం నగదు సాయం ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతున్నా ప్రస్తుతం రైతుబంధు రూపంలో ఇస్తున్న పెట్టుబడి సాయం దానికోసమే కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది.

Next Story

Most Viewed