అవాంఛిత Sex కోరికలు వెంటాడుతున్నాయా.. ఓపెన్ అవలేకపోతున్నారా..?

207

దిశ, ఫీచర్స్ : జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో అవాంఛిత, అసంకల్పిత ఆలోచనలు లేదా షాక్‌కు గురిచేసే చిత్రాలు కలవరపెడుతుంటాయి. కొన్నిసార్లు ఇవి సాధారణంగా కనిపించినా.. మరికొన్నిసార్లు అసహ్యకరంగా, హింసాత్మకంగానే కాక సెక్సువల్ డిజైర్స్‌కు సంబంధించినవిగా ఉండవచ్చు. బయటికి చెప్పుకోలేని, ఎవరూ ఆమోదించని రీతిలో ఉండి నిత్యం వెంటాడొచ్చు. ఇలాంటి ‘అనుచిత ఆలోచనలు’ ఏమంత హానికరం కాదు. కానీ ఎంతగా నియంత్రించుకున్నా, వదిలించుకుందామన్నా మళ్లీ మళ్లీ మెదడును తొలిచేస్తుంటే మాత్రం రోజువారీ జీవితానికి అంతరాయం కలుగుతుంది.

క్రమంగా ఆందోళన, నిరాశ లేదా అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD)కు దారితీసే ప్రమాదముంది. నిజానికి అనుచిత ఆలోచనలు.. అవి అనుభవిస్తున్న వ్యక్తుల సహజ స్వభావానికి విరుద్ధంగా ఉంటాయి. అసంకల్పితంగా ఏర్పడే ఈ భావనలను అంతర్గతంగ వ్యతిరేకించే క్రమంలో మానసిక సంఘర్షణకు గురవుతారు. కాగా యూకేలోని స్వచ్ఛంద సంస్థ OCD- UK.. ఇలాంటి ఆలోచనల గురించి కొన్ని సాధారణ అంశాలను వివరించింది.

లైంగికంగా అనుచిత ఆలోచనలు :

జెండర్‌తో సంబంధం లేకుండా స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే సెక్సువల్ థాట్స్ కలిగి ఉండటం సహజం. అయితే అసంకల్పిత ఆలోచనల విషయానికొస్తే.. ఒక వ్యక్తి లైంగికత చుట్టూ తిరుగుతూ లేదా ఇతరులకు లైంగికంగా హాని కలిగించే విధంగా ఉంటాయి. ఈ థాట్స్ ఎదుర్కొంటున్న వారు.. చిన్న పిల్లలు, తమ కుటుంబ సభ్యుల పట్ల లైంగికంగా ఆకర్షితులవుతున్నట్లుగా భయపడటం లేదంటే తమ లైంగిక ధోరణి గురించి భయాలను కలిగి ఉంటారు. ఇక భాగస్వామి ప్రవర్తనను పర్టిక్యులర్‌గా విశ్లేషించడం, విశ్వసనీయత గురించి అనుమానపడుతూ వారి నుంచి నిరంతరం భరోసా కోరుకోవడం కూడా ఇదే కోవకు చెందుతుంది. అయితే అసౌకర్యానికి, షాక్‌కు గురిచేసే ఇలాంటి థాట్స్‌‌ను ప్రయత్నిస్తే నియత్రించగలమని అంటున్నారు నిపుణులు. ఇవి పాసింగ్, ఆటోమేటిక్ థాట్స్ మాత్రమేనని.. ఈ సమయంలో తామేంటో గుర్తుచేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

హింసాత్మక ఆలోచనలు :

ఈ ఆలోచనలు పర్సనల్‌గా లేదా మరొకరిని బాధపెట్టడం వంటి హింసాత్మక కోణాన్ని కలిగి ఉండవచ్చు. ప్రియమైన వారికి లేదా పిల్లలకు హాని చేయడం, ఎవరినైనా చంపడం లేదా ఇతరులకు హాని కలిగించాలనే ఆలోచనలు వచ్చినప్పుడు తమ దగ్గర కత్తులు లేదా ఇతర పదునైన వస్తువులను పెట్టుకుంటారు. అంతేకాదు ఆహారంలో విషం కలపాలనుకునే భావనలు కలగవచ్చు. ఈ క్రమంలోనే ఒక్కోసారి తమకు కలిగే అగ్రెసివ్ థాట్స్‌ను అనుసరించాలని బలంగా అనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా డాక్టర్ లేదా థెరపిస్ట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. ఇలాంటివారు ఇతర వ్యక్తులను కలవకుండా, పబ్లిక్ ప్లేసులకు వెళ్లకుండా ఉండటమే మంచిది.

ప్రతికూల/ఇతరత్రా అనుచిత ఆలోచనలు

కొన్నిసార్లు అనుకున్న పనులు నెరవేరనప్పుడు తమను తాము ‘ఓడిపోయిన వ్యక్తి’గా లేదా తగినంతగా రాణించడం లేదని భావించవచ్చు. ఇలాంటి సమయంలోనే ఆలోచనలు మసకబారతాయి. ఈ స్థాయి పెరిగితే నిరాశ లేదా ఆందోళన తీవ్రతరం అవుతుంది. ఒక్కోసారి చిత్ర విచిత్రమైన లేదా మతిస్థిమితం లేని ఆలోచనలు చుట్టుముడతాయి. వాటిపై నియంత్రణ ఉండదు. చాలాసార్లు సదరు ఆలోచనలకు సంబంధించి జీవితంలో ఎలాంటి ప్రయారిటీ లేదా ఔచిత్యం ఉండదు. అలాంటివి వ్యక్తిగతంగా తీసుకోకపోవడం లేదా వాటిపై కాన్సంట్రేట్ చేయకపోవడమే మంచిది. అయితే ఇవి దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం అంతర్గత మానసిక రుగ్మతను తగ్గించుకునేందుకు వైద్యున్ని సంప్రదించాల్సిందే.

అవాయిడ్ చేయడం ఎలా?

* నియంత్రించలేని అనుచిత ఆలోచనలను గుర్తించి వాటిని లేబుల్ చేయాలి.

* దూరంగా నెట్టడానికి ప్రయత్నించే బదులు జాప్యం వహించాలి.

* కచ్చితంగా చివరకు జయిస్తామని విశ్వాసాన్ని కలిగి ఉండాలి.

* ఆలోచనలు మసకబారేందుకు మీకు మీరే సమయం కేటాయించుకోవాలి.

* డిస్టర్బ్ అవుతున్నప్పటికీ చేస్తున్న పనిని ఆపకుండా కొనసాగించాలి.

ఏం చేయొద్దు :

* ఈ యాదృచ్ఛిక, పునరావృత ఆలోచనలు అనుసరించడం

* ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించుకోవడం

* వాటి వెనుక అర్థాన్ని తెలుసుకునేందుకు ఆరాటపడటం

* ఆలోచనలను అణచివేస్తే తిరిగిరావని బలవంతంగా ప్రయత్నించడం

సహాయం ఎప్పుడు పొందాలి?

అనుచిత ఆలోచనల్లో కొన్నింటికి చికిత్స సాధ్యపడుతుంది. కొంతమంది OCD లేదా PTSDని అధిగమిస్తారు, కానీ దీనికి సమయం పట్టవచ్చు. అయితే రోజువారీ జీవితంపై ఈ ఆలోచనల ప్రభావం ఉండనీయకుండా జాగ్రత్తవహిస్తే సమస్య లేకుండా జీవించగలుగుతారు. కానీ ఇవి మీ శక్తిని హరించి, బాధ కలిగిస్తుంటే లేదా రోజును గడపడం కష్టతరంగా చేస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించి లక్షణాలను వివరించాలి. అవసరమైతే తదుపరి రోగనిర్ధారణ, చికిత్స కోసం వారు బిహేవియర్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్ లేదా సైకియాట్రిస్ట్‌‌ను రిఫర్ చేస్తారు.